ఉత్త మాటలే…!

  • హోదా, విభజన హామీల ఊసెత్తని మోడీవిశాఖ
  • ఉక్కు ప్రస్తావన లేదు
  •  చంద్రబాబు, పవన్‌లదీ అదే తీరు
  • రాష్ట్రంలో అవినీతి సర్కారును ఓడించాలని పిలుపు
  • వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యమని ప్రకటన శ్రీ ఇండియా బ్లాక్‌పై విమర్శలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ‘ప్రజాగళం’ పేరుతో జరిగిన ప్రధాని మోడీ సభ మాటల మాయాజాలానికే పరిమితమైంది. ఎన్‌డిఎ కూటమిలోని తెలుగుదేశం, జనసేన, బిజెపి కలిసి రాష్ట్రంలో నిర్వహించిన తొలి సభ కావడంతో పాటు, ప్రధాని మోడీ హాజరవుతుండటంతో రెండు రోజుల ముందునుండే కార్పొరేట్‌ మీడియా విస్తృత ప్రచారం కల్పించింది. రాష్ట్రం ఎదుర్కుంటున్న అన్ని సమస్యలకు ఈ సభలోనే మోడీ పరిష్కారం చేస్తారన్నట్లుగా ఈ ప్రచారం సాగింది. అయితే, ఆదివారం సాయంత్రం జరిగిన సభలో మోడీ రాష్ట్రానికి సంబంధించిన అన్ని కీలక సమస్యలను విస్మరించారు. ప్రత్యేకహోదా, విభజన హామీలను కూడా ఆయన ప్రస్తావించలేదు. కొద్ది సంవత్సరాల క్రితం తాను స్వయంగా శంకుస్థాపన చేసి, పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లు కుమ్మరించిన అమరావతికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఈ సభ జరిగినప్పటికీ రాజధాని అంశాన్ని మోడీ మాటవరసకి కూడా మాట్లాడలేదు. సంవత్సరాల తరబడి సాగుతున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటాన్ని ప్రస్తావించడం కానీ, రాష్ట్ర ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని చెప్పడంకానీ చేయలేదు. అసలు అటువంటి ఆందోళనే రాష్ట్రంలో జరుగుతున్న విషయం తెలియని విధంగా ప్రధాని ప్రసంగం సాగింది. ఇతర ముఖ్యమైన సమస్యలను విస్మరించిన ప్రధాని ‘వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌’ తమ లక్ష్యమని చెప్పారు. సమస్యలు పరిష్కరించకుండా వికసిత రాష్ట్రం ఎలా సాధ్యమవుతుందో వివరించలేదు. ప్రధానికి ముందు ప్రసగించిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ కూడా ఈ అంశాలను నామమాత్రంగా కూడా ప్రస్తావించకపోవడంతో ఈ అంశాలపై ఎన్‌డిఎ కూటమి వైఖరి స్పష్టమైందన్న వ్యాఖ్యలు వినిపిస్తునాయి. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం అధికారంలో ఉందని, దానికి చరమ గీతం పాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మంత్రులు అవినీతిలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారని అన్నారు. కేంద్రంలో ఎన్‌డిఎకి మూడో సారి అధికారం ఇవ్వడం, రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వానికి చరమగీతం పాడటమన్న రెండు సంకల్పాలను ప్రజలు తీసుకోవాలని చెప్పారు. వైసిపి పాలనలో గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని చెప్పారు. ఎన్‌డిఎతోనే దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రంలో జగన్‌ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ వేర్వేరు కాదని, రెండు ఒకే కుటుంబం చేతిలో ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. ఇండియా బ్లాక్‌లో పార్టీలు ఎవరికి వారుగా వ్యవహరిస్తుంటారని అన్నారు. ఎన్నికల అవసరాలకోసం ఏర్పాటైందని అన్నారు. పదేళ్ల తన పాలనలో రాష్ట్రానికి ఎంతో చేశానని చెప్పారు. అనేక జాతీయ విద్యాసంస్థలను ఇచ్చినట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా 30 కోట్ల మందిని పేదరికం నుండి బయట పడేసినట్లు చెప్పారు. ఎన్‌డిఎకు 400కు పైగా ఎంపీ సీట్లు దాటాలని అప్పుడే వికసిత్‌ భారత్‌, ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యం సాధ్యమవుతుందని చెప్పారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఇద్దరూ రాష్ట్ర వికాసానికి చేసిన కృషిని, పోరాటాన్ని ప్రజలు గుర్తించాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ డబుల్‌ ఇంజిన్‌ సర్కారు రావాలని చెప్పారు. కోటప్ప కొండకు సమీపంలో సభ జరుగుతుండటంతో ‘త్రిమూర్తుల’ ఆశీర్వాదం తనకు లభిస్తోందని చెప్పారు. మూడవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత మరిన్ని ధృడమైన నిర్ణయాలను తీసుకోవాల్సివుందన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహరావును, టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్‌టి రామారావును తన ప్రసంగంలో మోడీ గుర్తు చేసుకున్నారు. ఎన్‌టిఆర్‌ రాముడి పాత్రలో జీవించారని, రైతుల కోసం, పేదల కోసం పోరాడారని అన్నారు. ఎన్‌టిఆర్‌ శతాబ్ధి ఉత్సవాల వేళ ఆయన స్మారక నాణాన్ని విడుదల చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ విస్మరించిన, తెలుగుబిడ్డ పివి నరసింహరావుకు భారత రత్న ఇచ్చి గౌరవించినట్లు చెప్పారు.

రాష్ట్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం : పవన్‌
దేశంతో పాటు, రాష్ట్రంలోనూ ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. రాష్ట్రంలో ఎన్‌డిఎ పునరుద్ధరణతో ప్రజలు ఆనందంగా ఉన్నారని చెప్పారు. 2014లో తిరుపతి వెంకన్న సాక్షిగా పొత్తు ప్రారంభమైందని, బెజవాడ దుర్గమ్మ సాక్షిగా ఇప్పుడు కొత్త రూపు తీసుకుంటోందని అన్నారు. మోడీ అమరావతికి అండగా ఉండటానికి వచ్చారని, భవిష్యత్తులో అమరావతి దేదీప్యమానంగా వెలుగొందుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌ సారా వ్యాపారిగా మారారని విమర్శిం చారు. వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్‌కు రాజధానిగా మార్చిందని విమర్శించారు. అవినీతి, నల్లధనాన్ని తగ్గించడా నికి మోడీ ప్రయత్నిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నల్లధ నాన్ని పెంచి పోషిస్తుందన్నారు.  సంపూర్ణ మద్యపానం అని చెప్పి సారా వ్యాపారం జగన్‌ చేస్తున్నారని విమర్శించారు. మోడీ దేశాన్ని డిజిటలైజేషన్‌ వైపు తీసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారని, జగన్‌ మద్యం షాపుల్లో నగదును మాత్రమే అనుమతిస్తూ రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి 2019లో 10.24 శాతంగా ఉండగా, ప్రస్తుతం-3 శాతానికి పడిపోయిం దన్నారు. డబ్బు అండతో ఏమైనా చేయగలనని జగన్‌ అనుకుంటున్నారని, ఎన్నికల కురుక్షేత్రంలో ఆయన ఓటమి ఖాయమని చెప్పారు. పొత్తే గెలుస్తుందని, కూటమిదే విజయమని అన్నారు.

మా జెండాలు వేరైనా..అజెండా ఒక్కటే : చంద్రబాబు
ఎన్‌డిఎ కూటమిలో తమ పార్టీల జెండాలు వేరువేరు అయినా అజెండా ఒక్కటేనని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ‘ప్రజాగళం’ సభలో మోడీపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. ‘మోడీ విజనే .. నా విజన్‌’ అని ఆయన ప్రకటించారు. ‘ప్రజాగళం’ సభలో ప్రధానికి ముందు ప్రసంగించిన బాబు ఆయనను ప్రశంసలలో ముంచెత్తారు. ‘మోడీ వ్యక్తి కాదు. భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న శక్తి. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రపంచం మెచ్చిన నాయకుడు.’ అని అన్నారు. ‘ మా జెండాలు వేరు కావచ్చు. అజెండా ఒక్కటే. సంక్షేమం, అభివృద్ది, ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యం’ అని అన్నారు. రాష్ట్ర పునర్‌ నిర్మాణ సభగా ప్రజాగళం సభను ఆయన అభివర్ణించారు. ఐదేళ్ల కాలంలో జరిగిన విధ్వంసం, అహంకార పాలనతో ప్రజల జీవితాలు నాశనమయ్యాయని చెప్పారు. ప్రజల గుండె చప్పుడు బలంగా వినిపించేందుకే టిడిసి, జనసేన, బిజెపి జట్టుకట్టినట్లు తెలిపారు. భారత్‌ను నెంబర్‌ వన్‌ దేశంగా తీర్చి దిద్దే శక్తి మోడీకి ఉందని, ఆయన నాయకత్వంలో దేశం దూసుకుపోతుందని చెప్పారు. రాష్ట్ర విభజన తరువాత ఎదురైన సమస్యలను, సవాళ్లను అధిగమించినట్లు తెలిపారు. రాజధాని అమరావతి పూర్తయివుంటే రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో ఉండేదని చెప్పారు. జగన్‌ మూడు ముక్కలాటతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని అన్నారు. పోలవరాన్ని గోదావరిలో కలిపారని, సహజ వనరులను దోచేశారని, జె. బ్రాండ్‌తో కల్తీ లిక్కర్‌ తెచ్చి అనేకమందిని బలితీసుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులను తరిమేశారని చెప్పారు. పరిశ్రమలు, ఉద్యోగాలు లేవన్నారు. బంగారంలాంటి రాష్ట్రాన్ని జగన్‌ చీకటి మయం చేశారని చెప్పారు. అక్రమ కేసులు పెట్టి రాజకీయలను కలుషితం చేశారని అన్నారు. ఆయన అధికార దాహానికి బాబారు బలయ్యారని, ఇద్దరు చెల్లెళ్లు రోడెక్కారని అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని,ప్రజలు గెలవాలని అన్నారు. దేశంలో ఎన్‌డిఎకు 400కు పైగా సీట్లు వస్తాయని, రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు గెలిపించే బాధ్యతను ప్రజలు తీసుకోవాలని చెప్పారు.

➡️