- ప్రధాని విశాఖ పర్యటను వ్యతిరేకిస్తూ ఆందోళనలు
- విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్
ప్రజాశక్తి-యంత్రాంగం : విభజన హామీలను అమలు చేయకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, కడప స్టీల్ పరిశ్రమలను అటకెక్కించిన మోడీ ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారని నేతలు ప్రశ్నించారు. వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి ఆ హామీని తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన మోడీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటను వ్యతిరేకిస్తూ అనంతపురం కలెక్టరేట్ ఎదుట సిపిఎం నాయకులు, కార్యకర్తలు బైఠాయించి ఆందోళన చేపట్టారు. కేంద్రం పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప మాట్లాడుతూ వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో నిరసనలు హోరెత్తించారు. విశాఖ పర్యటనలోనే ప్రధాని ఉక్కుపై స్పందించాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేటుపరం చేయడాన్ని ఆపాలంటూ కార్మికులు ఓ పక్క పోరాటాలు చేస్తుంటే పట్టించుకోని మోడీ, మిట్టల్ స్టీల్ పరిశ్రమకు చేయూతనిచ్చేందుకు విశాఖ వస్తుండడం సిగ్గుచేటన్నారు. కర్నూలులో జిల్లా పరిషత్ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. విభజన హామీలు అమలు చేయాలంటూ నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశారు, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.నిర్మల పాల్గొన్నారు. నంద్యాలలో కలెక్టరేట్ ఎదుట, నందికొట్కూరులో పటేల్ సెంటర్‌లో రాస్తారోకో చేశారు. అభివృద్ధి పట్టని మోడీ రాష్ట్రానికి రావద్దు అంటూ నినాదాలు చేశారు. తిరుపతిలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళనలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, నగర కార్యదర్శి కె.వేణుగోపాల్ పాల్గొన్నారు. పుత్తూరు, రేణిగుంట, సత్యవేడు, గూడూరు, శ్రీకాళహస్తిల్లో ఆందోళనలు చేపట్టారు. చిత్తూరులోని గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. కడప కలెక్టరేట్ ఎదుట, అన్నమయ్య జిల్లా రాయచోటి బస్టాండ్ సర్కిల్, మదనపల్లెలో మార్కెట్ యార్డ్ వద్ద ఆందోళనలు నిర్వహించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోన్న మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.