తీరుమారని మోడీ సర్కారు

  • వ్యవసాయాన్ని కార్పొరేట్లకు వేగంగా కట్టబెట్టే ప్రయత్నం
  • నవంబరు 26న దేశ వ్యాప్త ఆందోళనలు
  • రైతులకు ప్రతినెలా రూ.10 వేల పింఛను ఇవ్వాలి
  • ఎఐకెఎస్‌ నాయకులు కృష్ణప్రసాద్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రైతాంగ మహా పోరాటం తరువాత కూడా వ్యవసాయ రంగంపై కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వ తీరు ఏ మాత్రం మారలేదని అఖిల భారత కిసాన్‌ సభ సంయుక్త కార్యదర్శి పి.కృష్ణప్రసాద్‌ అన్నారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఎపి రైతు సంఘం ఆధ్వర్యాన సోమవారం జరిగిన రాష్ట్రస్థాయి వర్కుషాపులో ఆయన మాట్లాడుతూ రైతుల పోరాటంతో మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసినప్పటికీ, ఏదో ఒక రూపంలో ఆ విధానాలను కొనసాగిస్తోందని చెప్పారు. వ్యవసాయాన్ని కార్పొరేట కు వేగంగా కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా 9.3 కోట్ల మంది రైతులను కార్పొరేట్‌ వ్యవసాయం కిందకు తీసుకురానుందని చెప్పారు. రాష్ట్ర జాబితాలో ఉన్న సహకార రంగాన్ని లాగేసుకున్న విధంగానే వ్యవసాయ చట్టాలను సైతం కేంద్రం కబ్జా చేస్తోందన్నారు. దీనిలో భాగంగా మార్కెటింగ్‌, కోల్డ్‌ స్టోరేజి వ్యవస్థలను కబళించే ప్రయత్నం చేస్తోందని చెప్పారు. పంట రుణాలపైన కూడా జిఎస్‌టి విధిస్తున్నారని తెలిపారు. ఈ తరహా టాక్సుల వల్ల పంటలకు ధరలు రావని అన్నారు. కేంద్రం అమెజాన్‌, సింజెంటా వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటోందని, దీనివల్ల ప్రభుత్వ రంగంలో జరగాల్సిన పరిశోధనలు కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్తున్నాయని తెలిపారు. ఇప్పటికే పంటల బీమా ప్రైవేటు కంపెనీల చేతుల్లో ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. పంటల బీమా ప్రభుత్వ రంగంలోనే నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం నుండి రావాల్సిన రాష్ట్ర వాటా నిధులను, గ్రాంట్లను సాధించుకోవాల్సి ఉండగా ఇక్కడి ప్రభుత్వాలు దేబిరిస్తున్నాయని విమర్శించారు. ప్రస్తుతం ఇస్తున్న కనీస మద్దతు ధర ఏ మాత్రం చాలదన్నారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు తెచ్చుకున్న వారు వాటిని తీర్చడానికి మరో మార్గం లేక పంటలను అమ్ముకుంటున్నారని చెప్పారు. అవసరమైన చోట 2013 చట్టం ప్రకారం భూసేకరణ జరపాలని, పరిహారమూ అలాగే చెల్లించాలని అన్నారు. ప్రతి రైతుకు పింఛనుగా ప్రతి నెలా పది వేల రూపాయలు చెల్లించాలని కోరారు. రైతాంగ, వ్యవసాయ సమస్యల పరిష్కారం కోసం రైతులను సమీకరించి గ్రామస్థాయి నుండి ఆందోళనలు చేపట్టాలని అన్నారు. నవంబరు 26న దేశ వ్యాప్తంగా సంయుక్త కిసాన్‌ మోర్చా, ట్రేడ్‌ యూనియన్లు, వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యాన జిల్లా కేంద్రాల్లో సమావేశాలు, సభలు, ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించాలని ఆయన కోరారు.
సభకు అధ్యక్షత వహించిన రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ రైతాంగ ఆత్మహత్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అన్నారు. జగన్‌ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని, ఐదేళ్లలో ఆరువేలమంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు దాటిపోయినా ఇచ్చిన వాటిల్లో ఒక్కదాన్ని మాత్రమే అమలు చేసిందని తెలిపారు. రైతులకు రూ.13 వేల నుండి రూ.20 వేలకు పెంచి ఇస్తామన్న సాయం వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు చెబుతున్నారని విమర్శించారు. వ్యవసాయంపై 63 శాతం మంది ప్రజలు జీవిస్తుంటే వారి గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అన్నారు. 300 మండలాల్లో కరువుతో అల్లాడుతుంటే ఒక్క ఎకరానికీ పంటల బీమా అమలు చేయలేదని చెప్పారు. స్మార్ట్‌ మీటర్ల విషయంలో వైసిపి, టిడిపి ఒకే విధానంతో ఉన్నాయని తెలిపారు. తొలుత ఎపి రైతు సంఘం ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ ఉద్యమంలో అశువులు బాసిన రైతులకు, రైతు నేతలకు, ఇటీవల వరదల్లో చనిపోయిన వారికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా నిముషం పాటు మౌనం పాటించి సంతాపం తెలిపారు. సభకు వి.కృష్ణయ్య, హేమలత, బి.రామకృష్ణ, వి.రాంబాబు అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. తొలుత సీనియర్‌ నాయకులు వై.కేశవరావు రైతు సంఘం జెండాను ఆవిష్కరించారు. సభలో ప్రజానాట్యమండలి గాయకులు రైతు గీతాలను ఆలపించారు.

➡️