జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రారంభించిన మోడీ

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె వద్ద ఏర్పాటు చేసిన ఫిషింగ్‌ హార్బర్‌ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా శుక్రవారం ప్రారంభించారు. మహారాష్ట్రలోని పాల్ఘర్‌ నుంచి ఫిషింగ్‌ హార్బర్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కావలి నియోజకవర్గానికి మణిహారం లాంటి జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ను ప్రారంభించుకోవడం సంతోషదాయకమన్నారు. హార్బర్‌ నిర్మాణం ద్వారా సంవత్సరానికి 40 వేల టన్నుల మత్స్య సంపదను వెలికితీయవచ్చని తెలిపారు. మత్స్యకారులు చేపల వేట సాగించేందుకు ఇన్నాళ్లుగా పడుతున్న ఇబ్బందులు నేటితో ముగిశాయన్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లనవసరం లేకుండా స్థానికంగానే చేపల వేట సాగించవచ్చని తెలిపారు. కలెక్టర్‌ ఆనంద్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో రూ.288.8 కోట్ల వ్యయంతో 76.89 ఎకరాల్లో నిర్మించిన ఫిషింగ్‌ హార్బర్‌ను ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ, జడ్‌పి చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ, జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, మత్స్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ నాగేశ్వరరావు, జువ్వలదిన్నె సర్పంచ్‌ అంకమ్మ, బోగోలు జెడ్‌పిటిసి సులోచనమ్మ, వందలాది మత్స్యకారులు పాల్గొన్నారు.

➡️