కార్పొరేట్లకు దోచిపెడుతోన్న మోడీ

  • కార్మికులకు అండగా ఎర్రజెండా
  • సిఐటియు ఆల్‌ ఇండియా నాయకులు నరేంద్రరావు

ప్రజాశక్తి-నెల్లూరు : కార్మిక వర్గాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తూ కార్పొరేట్‌ వర్గాభివృద్ధికి ప్రధాని మోడీ సహకరిస్తున్నారని సిఐటియు ఆల్‌ ఇండియా నాయకులు నరేంద్రరావు విమర్శించారు. కార్మిక వర్గానికి అండగా నిలుస్తూ వారి సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు, పోరాటాలు చేస్తూ ఆ వర్గానికి విముక్తి కలగించేది ఒక్క ‘ఎర్ర జెండా’ మాత్రమే అని అన్నారు. సిపిఎం 27వ రాష్ట్ర మహాసభ నిర్వహణ సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం నెల్లూరులోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ‘కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు-కార్మిక వర్గం కర్తవ్యాలు’ అన్న అంశంపై సెమినార్‌ నిర్వహించారు. ఈ సెమినార్‌కు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.అజరుకుమార్‌ అధ్యక్షత వహించారు. ముఖ్యవక్తగా హాజరైన నరేంద్రరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవని, ప్రయివేట్‌ సంస్థలు మాత్రమే ఎక్కువ కాలం మనగలుగుతాయని చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. కార్పొరేట్లు దేశ సంపద సృష్టికర్తలుగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడడం దారుణమన్నారు. కార్మికులు, ట్రేడ్‌ యూనియన్లు, అనేక మంది తమ సమస్యల సాధన కోసం పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నారని తెలిపారు. కార్మిక వర్గంల్లో విశ్వాసం నింపేందుకు ప్రయత్నించేది ఎర్రజెండా మాత్రమేనని అన్నారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు మాట్లాడుతూ.. దోపిడీ లేని రాజ్యం రావాలన్నదే సిఐటియు ప్రధాన లక్ష్యమన్నారు. నిజాయతీకి, త్యాగాలకు మారుపేరు కమ్యూనిస్టులని తెలిపారు. తాము పండించిన పంటకు కనీస మద్దతు ధర ప్రకటించాలంటూ ఏడాదికి పైగా రైతాంగం ఉద్యమం చేపట్టి చరిత్ర సృష్టించిందన్నారు. రైతులు చేసిన పోరాట ఫలితంగానే ప్రభుత్వం దిగివచ్చి రైతులు పండించిన పంటకు మద్దతు ధర ప్రకటిస్తామని హమీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సెమినార్‌లో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం. మోహన్‌ రావు, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️