- డిఫెన్స్ కో-ఆర్డినేషన్ కమిటీ నాయకులు రెడ్డి వెంకటరావు
ప్రజాశక్తి- కలెక్టరేట్ (విశాఖపట్నం) : దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కంకణం కట్టుకున్నారని డిఫెన్స్ కో-ఆర్డినేషన్ కమిటీ నాయకులు రెడ్డి వెంకటరావు విమర్శించారు. స్టీల్‌ప్లాంట్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద కార్మిక సంఘాల జెఎసి ఆధ్వర్యాన చేపట్టిన దీక్షలు గురువారం నాటికి 1388వ రోజుకు చేరాయి. ఈ దీక్షా శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ తెల్లారితే దేశం, దేశభక్తి అని ప్రగాల్భాలు పలికే మోడీ.. ఆఖరికి రక్షణ రంగాన్ని కూడా ప్రయివేటీకరించడానికి పూనుకున్నారని తెలిపారు. ఉక్కు ప్రయివేటీకరణ ప్రకటన వచ్చినప్పటి నుంచి నిర్విరామంగా కార్మిక, రైతు, ప్రజా సంఘాలు విశాఖ ఉక్కు రక్షణ పోరాటంలో పాల్గొంటున్నాయని తెలిపారు. మోడీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించి సెయిల్‌లో విలీనం చేసి, కార్మికులకు బకాయి జీతాలు చెల్లించేంతవరకు ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె లోకనాథం మాట్లాడుతూ విశాఖ ఉక్కు పోరాటంలో భాగంగా ఈ నెల 19వ తేదీన పాత గాజువాకలో చేపట్టే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ సెక్టర్ కో-ఆర్డినేషన్ కమిటీ నాయకులు కుమారమంగళం, డిఫెన్స్ యూనియన్ నాయకులు గోపాలకృష్ణ, జగన్నాథం, ప్రజానాట్యమండలి సీనియర్ నాయకులు ఎన్‌వి రమణ, జివిఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు గొలగాని అప్పారావు, జివిఎన్ చలపతి, కె కుమారి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.