- చంద్రబాబుకు వి శ్రీనివాసరావు సూచన
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయకుండా, ప్రభుత్వరంగంలోనే పరిరక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీని ఒప్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు సూచించారు. విశాఖలోని మద్దిలపాలెంలో సీతారాం ఏచూరి స్మారక భవన నిర్మాణ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సోమవారం విచ్చేసిన ఆయన మీడియా తో మాట్లాడుతూ ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి ఈ విషయమై దృష్టి సారించాలని కోరారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయకుండా మోడీచేత నిర్ణయం చేయించి, ఐదు కోట్ల మంది ప్రజల డిమాండ్‌ను నెరవేర్చాలన్నారు. ఇప్పటికే ‘ఉక్కు’ పరిరక్షణకు మూడేళ్లుగా పలు రూపాల్లో పోరాడుతూ కార్మికులతో పాటు సిపిఎం, వామపక్షాలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయని తెలిపారు. కేంద్రంలో అధికారంలో భాగస్వామి అయిన చంద్రబాబు లాంటి వారు నేటి తరుణంలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను నిలుపుదల చేస్తున్నట్లు కేంద్రంతో ప్రకటింపజేయాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడా లేనిరీతిలో విశాఖ ప్రజలు కూటమి పార్టీలకు, అందులోనూ గాజువాక నియోజకవర్గంలో టిడిపికి భారీ మెజారిటీ కట్టబెట్టారన్నారు. రెండు నెలలగా స్టీల్‌ప్లాంట్‌లోని మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లను పూర్తిగా పనిలోకి తీసుకురావాలని, కాంట్రాక్టు కార్మికులను తొలగించే ప్రక్రియను నిలిపేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఈ విషయాలను ప్రస్తావించకపోయినా, కేంద్రం నుంచి సరైన స్పందన రాకపోయినా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్వహించే భవిష్యత్తు పోరాటాలకు సిపిఎం, వామపక్షాలు పూర్తి మద్దతు ఇస్తాయన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చి కర్మాగారాన్ని కాపాడుకుంటామని తెలిపారు.