ఆంధ్రాకు మొండి చెయ్యి చూపిన మోదీ

స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకపోవడం దారుణం

జగదాంబ జంక్షన్ లో వామపక్షాలు నిరసన
ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్ : రాష్ట్రంలో కూటమిప్రతం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా విశాఖపట్నం వచ్చిన ప్రధాని మోడీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలను ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలను తీవ్రంగా మోసగించారని, మోడీ ఒక దేశద్రోహి అని వామపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు.
విశాఖ సాక్షిగా మోదీ మరోసారి ద్రోహం చేశారని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు ఒక ప్రకటనలో ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరణ,సొంత ముడి ఇనుప గనులు కేటాయింపు, కాపిటల్ రీ స్ట్రచ్చరింగ్ క్రింద రూ.18 వేల కోట్లు పై ప్రధాని ప్రకటన చేయక పోవటం విశాఖకు, ఉత్తరాంధ్రకు మరో సారి ద్రోహం చేయడమే అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ కి అవసరమైన ముడి ఇనుప గనుల సరఫరా, ఇతర అనుమతులు గురించి సాగిల పడి మాట్లాడటం విశాఖ స్టీల్ ప్లాంట్ కి ద్రోహం చేయడమేనన్నారు.కేంద్ర బిజెపి,రాష్ట్ర టిడిపి, జనసేన కూటమి కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ను మిట్టల్ కి బలిచ్చేలా కుట్ర పన్నినట్టు ఈ రోజు మోడీ బహిరంగ సభతో తేలిపోయిందన్నారు. దీనికి టిడిపి, జనసేన కూటమి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
ప్రధాని మోడి ప్రసంగంలో రాష్ట్రాన్ని వేధిస్తున్న సమస్యలపై స్పందించకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. ఆర్భాటంగా ఏర్పాటు చేసిన సభ,రోడ్ షోలకు తగ్గట్లుగా ప్రజలకు చేసిన మేలు లేదన్నారు. విభజన చట్ట ప్రకారం రావలసిన విశాఖ మెట్రో రైల్ మాట కూడా మాట్లాడలేదన్నారు. ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ది ప్యాకేజీల సంగతి పూర్తిగా మరిచారన్నారు.
పక్కనే ఉన్న ముఖ్య మంత్రి చంద్రబాబు, ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ కనీసంగా కూడా అడగలేదని, సరికదా, ఆయనను సంపన్నం చేసుకోవడానికే ఇద్దరూ పోటీ పడ్డారన్నారు. ముచ్చటగా ముగ్గురూ కలిపి ఈ సభా వేదికగా ఆంధ్ర రాష్ట్రానికి మోసం చేశారని తీవ్రంగా ఆరోపించారు.సభ అంతా ఒకర్నొకరు పొగుడుకోవడంతోనే సరిపోయిందన్నారు.
ప్రజలు ఒద్దు మొర్రో అంటున్నా, నక్కపల్లి బల్క్ డ్రగ్స్ ప్లాంటుకు శంకుస్థాపన చేశారన్నారు. నిర్వాసితుల ఊసెత్తకుండా గ్రీన్ ఎనర్జీ, అత్యధిక ఆదాయం గడిస్తున్న వాల్తేర్ రైల్వే డివిజన్ కొనసాగించాలని ఎంత కోరినా దాన్ని పక్కన పెట్టారన్నారు. పదేళ్ళ నుండి ఊరిస్తూ, ఊరిస్తూ ఎట్టకేలకు రైల్వే జోన్ కు శంకుస్థాపన చేయడంలో గర్వ పడవలసిన దేముందని, పదేళ్ళ క్రితం రావలసినది ఇంత ఆలస్యం చేసింది ఇందుకా? అని ప్రశ్నించారు.
స్టీల్ ప్లాంటుపై ప్రధాని ప్రకటన చేయాలని కోరుతూ,ప్రదర్శన చేస్తున్న వామపక్ష నాయకులను అరె స్టు చేయడం, ముందు రోజు నుండే సిపిఎం నాయకులను గృహ నిర్భంధం చేయడాన్ని జగ్గు నాయుడు తీవ్రంగా ఖండించారు.
ఇప్పటికైనా స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, సెయిల్ లో మెర్జ్ చేయాలని, సొంత గనులు కేటాయించాలని, బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం సభలో స్టీల్ ప్లాంట్ కోసం ప్రధాని మోడీ, కూటమి ప్రభుత్వం నాయకులు మాట్లాడక పోవటాన్ని నిరసిస్తూ గురువారం జగదాంబ జంక్షన్ లో వాము పక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్ బి.గంగారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, సంహరణ, ముడి ఇనుప గనులు , క్యాపిటల్ రీ స్ట్రచ్చరింగ్ కింద రూ.18 వేల కోట్లు మంజూరిపై ప్రధాని మోడీ ప్రకటన చేయకపోవడం దుర్మార్గం అన్నారు. విశాఖకు, ఉత్తరాంధ్రకు మరోసారి ద్రోహం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను పూర్తిగా ప్రైవేటుపరం చేసి, ఆర్సి మిట్టల్ కి బలి ఇచ్చేలా కుట్ర పన్నినట్టు బహిరంగ సభతో రుజువైందన్నారు. గంట సభ కోసం లక్షల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. మోడీ పక్కనే కూర్చున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కనీసం స్టీల్ ప్లాంట్ కోసం అడగలేదని, సరి కదా ఆయనను సంపన్ను చేసుకోవడం కోసం ఇద్దరూ పోటీపడి, పొగడ్తలతో కీర్తించారని ఆరోపించారు. అయినప్పటికీ సిపిఐ సిపిఎం ఇతర వామపక్ష పార్టీలతో కలిపి తాము చేపట్టిన ఆందోళన విరమించేది లేదని, మరింత ఉద్దతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి. జగన్,వి. కృష్ణారావు, బి. పద్మ, సిపిఐ జిల్లా కార్యదర్శి సభ్యులు జి.ఎస్.కె అచ్యుతరావు, క్షేత్ర పాల్ రెడ్డి, ఎస్.కె రెహమాన్,సిపిఐ ఎమ్మెల్యే నాయకులు దేవా తదితరులు పాల్గొన్నారు.

➡️