నేడు విశాఖకు మోడీ

  • పూడిమడకలో ఎన్‌టిపిసి గ్రీన్‌ ఎనర్జీ హైడ్రోజన్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన
  • దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు పునాదిరాయి
  • వర్చువల్‌ పద్ధతిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం
  • లక్షలాది మంది జనసమీకరణకు టిడిపి కూటమి నేతల కసరత్తు

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో, అనకాపల్లి ప్రతినిధి : భారత ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం విశాఖకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. సాయంత్రం నాలుగు గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి విశాఖలోని ఐఎన్‌ఎస్‌ డేగాకు ప్రధాని చేరుకుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, బిజెపి ఎంపి పురంధేశ్వరి సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు మోడీ పర్యటనలో భాగస్వాములు కానున్నారు. భద్రత కోసం ఇప్పటికే కేంద్ర రక్షణ దళాలకు చెందిన బలగాలు విశాఖకు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం ఒంటి గంటకే విశాఖకు విచ్చేసి వైజాగ్‌ పోర్టు గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ, వాల్తేరు డివిజన్‌తో కూడిన విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు వంటి అంశాలపై ప్రధాని ఏ ప్రకటనలు చేస్తారోనన్న చర్చ నడుస్తోంది. ఆంధ్రా యూనివర్సిటీ (ఎయు) గ్రౌండ్స్‌లోని బహిరంగ సభ ప్రాంగణం నుంచే జాతీయ గ్రీన్‌ హైడ్రోజనర్‌ మిషన్‌లో భాగంగా పూడిమడకలోని ఎన్‌టిపిసికి చెందిన గ్రీన్‌ హైడ్రోజన్‌ ఎనర్జీ ప్రాజెక్టుకు వర్చువల్‌గా శంకుస్థాపన చేయను న్నారు. విభజన హామీల్లో భాగమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది. పారిశ్రామిక, మౌలిక వసతుల రంగాలకు సంబంధిం చిన కొన్ని ప్రాజెక్టులనూ మోడీ ప్రారంభించను న్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రూ.19,500 కోట్ల విలువైన రైల్వే, రోడ్డు ప్రాజెక్టులను ప్రధాని ఇక్కడి నుంచే వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.

రోడ్‌ షో, బహిరంగ సభ ఇలా..

బుధవారం సాయంత్రం 4.45 నుంచి 5.30 గంటల వరకూ నగరంలోని వెంకటాద్రి వంటిల్లు నుంచి ఎయు ఇంజనీరింగ్‌ కళాశాల మైదానం వరకూ మోడీ రోడ్డు షో నిర్వహించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధాని సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం మూడు లక్షల మందిని సభకు తరలించే దిశగా కసరత్తు చేస్తోంది. విశాఖ నగరంలో ప్రజల రాకపోకలపై ఇప్పటికే ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ప్రధాని విశాఖ పర్యటన కోసం ప్రభుత్వం నాలుగు వేల మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసింది. 35 మంది ఐపిఎస్‌ల పర్యవేక్షణలో ఏర్పాట్లు సాగుతున్నాయి. మూడు లక్షల మందిని సమీకరించడానికి టిడిపి కూటమి నాయకులు ప్రశ్నిస్తున్నారు.

దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్‌ హబ్‌

విశాఖ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలోగల అనకాపల్లి జిల్లా పూడిమడకలో 1,600 ఎకరాల విస్తీర్ణంలో రూ.1.85 లక్షల కోట్ల పెట్టుబడితో హైడ్రోజన్‌ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. నేషనల్‌ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (ఎన్‌జిఇఎల్‌) నేతృత్వంలో విశాఖ ఎన్‌టిపిసి ఆధ్వర్యాన దీనిని ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోనే ఇది మొట్టమొదటిది. నీరు, గాలితో గ్రీన్‌ ఎనర్జీ హైడ్రోజన్‌ ఉత్పత్తిలో ఆసియా ఖండంలోనే అనువైన ప్రదేశంగా విశాఖ-పూడిమడక ప్రదేశం ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తిలో దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని చెప్తున్నారు. రోజుకు 1,500 టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌తోపాటు 4,500 టన్నుల గ్రీన్‌ అమ్మోనియా, 1,500 టన్నుల గ్రీన్‌ మిథనాల్‌, 1,500 టన్నుల సస్టెయినబుల్‌ ఏవియేషన్‌ ఫ్యూయెల్‌ (ఎస్‌ఎఎఫ్‌) లేదా గ్రీన్‌ యూరియాను ఉత్పత్తి చేయనున్నారు ఎన్‌టిపిసికి చెందిన రీసెర్చి అండ్‌ డవలప్‌మెంట్‌ (ఆర్‌అండ్‌డి) సెంటర్‌ ఈ హైడ్రోజన్‌ ఉత్పత్తి ప్రయత్నానికి నాంది పలికింది. థర్మల్‌ ప్లాంట్‌ అయితే కేవలం గంటకు లక్ష లీటర్లే తీసుకుని రీ సైక్లింగ్‌ చేసి సముద్రంలోకి అంతే మొత్తంలో వదులుతారు. గ్రీన్‌ ఎనర్జీ ప్లాంట్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తికి గంటకు లక్షల లీటర్ల చొప్పున సముద్రం నుంచి తీసుకుని అదే గంటలో అంతే మొత్తంలో వేడి నీటిని సముద్రంలోకి వదులుతారు.

కట్టుదిట్టమైన ఏర్పాట్లు : సిఎస్‌

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ తెలిపారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై మంగళవారం మరోసారి రాష్ట్ర సచివాలయం నుండి ఆయన వీడియో సమావేశం ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని పర్యటన ఏర్పాట్లలో ఏ చిన్న పొరపాటుకూ ఆస్కారం లేని రీతిలో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధాని వర్చువల్‌గా సుమారు 20 వరకూ వివిధ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారని, సంబంధిత శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లనూ పటిష్టంగా నిర్వహించాలన్నారు. ఈ వీడియో సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న డిజిపి ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు సంబంధించి ఎస్‌పిజి సమన్వయంతో పోలీస్‌ శాఖ తరఫున కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్‌) ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేశ్‌ కుమార్‌, ఇంటిలిజెన్స్‌ ఐజి పిహెచ్‌డి రామకృష్ణ, వర్చువల్‌ పలు శాఖల కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

➡️