వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి
ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ చిష్టి
ప్రజాశక్తి – ఆకివీడు (పశ్చిమగోదావరి జిల్లా) : దేశంలో మైనార్టీలపై మోడీ ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందని ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ చిష్టి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులోని షాదీఖానాలో సిపిఎం ఆధ్వర్యంలో ఆదివారం సదస్సు నిర్వహించారు. సిపిఎం ఏరియా కార్యదర్శి కె.తవిటినాయుడు అధ్యక్షతన జరిగిన సదస్సులో ముఖ్యఅతిథిగా చిష్ఠి హాజరై మాట్లాడారు. మానవ హక్కులను ఉల్లంఘించేలా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మైనార్టీలపై దాడులు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మత విశ్వాసాల ఆధారంగా రాజకీయాలు చేయడం తగదన్నారు. దేశంలో ఉన్న వక్ఫ్ ఆస్తులను కబ్జా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ చట్ట సవరణకు పాల్పడిందని తెలిపారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలంతా ఐక్యం కావాలని కోరారు. 2025 వక్ఫ్ చట్ట సవరణను తక్షణమే కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిజెపి వెనక్కి తగ్గకుంటే దేశంలోని సెక్యులర్ శక్తులన్నీ పెద్దఎత్తున ఉద్యమిస్తాయని హెచ్చరించారు. ఈ సదస్సులో ఆకివీడు ఏరియా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ ఎమ్‌డి.మదని, ఎమ్‌డి.షాజాద్, ఎస్‌కె.వలీ, ఎస్‌కె.బాజీ తదితరులు పాల్గన్నారు.
వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ ముస్లిముల నిరసన
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని ముస్లిములు డిమాండ్ చేశారు. ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ముస్లింలు నిరసన, శాంతియుత భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా పట్టణంలోని కబరస్తాన్ ఈద్‌గా మసీదు నుండి ప్రారంభమై ర్యాలీ గాంధీ సర్కిల్ వరకు సాగింది. జాతీయ జెండాలను చేతపట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వక్ఫ్ చట్ట సవరణను వెంటనే వెనక్కు తీసుకోవాలని నినదించారు. కర్నూలు నగరంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ చౌక్ బజార్ , వెంకయ్యపల్లి ఇందిరమ్మ కాలనీలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు.