డిజిటల్‌ మీడియాపై మోడీ దాడి

  • ఆధిపత్యం కోసమే బ్రాడ్‌కాస్టింగ్‌ బిల్లు
  • జాతీయ ‘మోడియా’గా మారిన మీడియా
  • టి-10 వార్షికోత్సవ జాతీయ సదస్సులో జాన్‌ బ్రిట్టాస్‌

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : జాతీయ మీడియా ‘మోడియా’గా మారాక, ఇప్పుడు ప్రధాని దృష్టి డిజిటల్‌ మీడియాపై పడిందని కేరళ ఎంపి, కైరళి టివి మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జాన్‌ బ్రిట్టాస్‌ అన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ మీడియా తటస్థంగా వ్యవహరించి ఉంటే, మోడీకి మూడు శాతం ఓట్లు తగ్గి, 200 సీట్ల కంటే తక్కువ వచ్చి ఉండేవని విశ్లేషించారు. ప్రధాన మీడియాపై ప్రజల్లో ఆదరణ తగ్గి, డిజిటల్‌ మీడియా ప్రభావం పెరిగి, మైండ్‌ ఇండిస్టీగా మారిందని, దీంతో, బ్రాడ్‌కాస్టింగ్‌ బిల్లు పేరుతో దానిపై మోడీ ఆంక్షలు విధిస్తున్నారని వివరించారు. డిజిటల్‌ మీడియాను క్రమేణా కార్పొరేటీకరించే ప్రయత్నాలు మొదలయ్యాయన్నారు. యూట్యూబ్‌లో ఏ వీడియో పోస్ట్‌ చేసినా అది ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా ఉంటే, దాన్ని ఎడిట్‌ చేయడం లేదా తొలగించడం కూడా ప్రభుత్వమే చేసేలా బ్రాడ్‌కాస్టింగ్‌ బిల్లులో నిబంధనలు చేర్చారని తెలిపారు. ఇందిరా గాంధీ మరణం తర్వాత రాజీవ్‌ గాంధీ అత్యధిక మెజారిటీతో ప్రధానిగా పనిచేశారని, అప్పటి మీడియా బోఫోర్స్‌ వంటి కుంభకోణాలను వెలికితీసి ప్రజలను జాగృతం చేసిందని, ఫలితంగా తర్వాతి ఎన్నికల్లో ఆయన అధికారాన్ని కోల్పోయారని గుర్తు చేశారు. గడిచిన 11 ఏళ్లగా జాతీయ మీడియా ఈ తరహా పరిశోధనాత్మక జర్నలిజం ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు.
రాజ్యాంగ పీఠికలోని అంశాలకు భిన్నంగా మోడీ ప్రభుత్వ పాలన సాగుతోందని, లోక్‌సభలో ఆయనకు పూర్తి మెజారిటీ రానందున ఈ దఫా మనుస్మృతితో కూడిన రాజ్యాంగ మార్పు జరగకున్నా, ఆ ముప్పు మాత్రం పొంచే ఉందని హెచ్చరించారు. 1992లో శిలాన్యాస్‌ పేరుతో బాబ్రీ మసీదు కూల్చివేసినప్పుడు అన్ని జాతీయ పత్రికలూ లౌకికత్వానికి భంగం కలిగిందంటూ ఎడిటోరియల్స్‌ రాశాయని, అవే పత్రికలు అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగితే దాన్నో చారిత్రక ఘట్టంగా అభివర్ణిస్తూ ఎడిటోరియల్స్‌ రాశాయని తెలిపారు. ఈ మార్పు ఎందుకు, ఎలా వచ్చిందో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. కార్పొరేట్‌ కబంధ హస్తాల్లో మీడియా చిక్కుకుని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తోందని విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు, రాముడికి ఎలాంటి సంబంధమూ లేదని, సానుభూతి, ప్రేమకు చిహ్నంగా రాముడిని కొలుస్తామని, నాథూరాం గాడ్సే ఆర్‌ఎస్‌ఎస్‌కు మాత్రమే చెందినవారని పేర్కొన్నారు. మణిపూర్‌ అల్లర్లతో అట్టుడుకుతుంటే ప్రధాని మోడీ… అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాన పూజారిగా వ్యవహరించారని ఎద్దేవా చేశారు. న్యాయవ్యవస్థలో హేతుబద్ధత, తర్కం లేకుండా తీర్పులు వస్తున్నాయని, దీన్నెలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. న్యాయమూర్తులు రిటైర్డ్‌ అవగానే కేంద్రప్రభుత్వం వారికి పదవులు ఇస్తోందని, దేశం ఎటుపోతుందో అర్థం కావట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రశ్నించే గొంతులను, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమానికి టీ-10 సిఇఒ శ్రీసుందర్‌ అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌, సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌.వినయకుమార్‌, నవతెలంగాణ సంపాదకులు ఆర్‌.సుధాభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రజానాట్యమండలి కళాకారులు పలు ప్రదర్శనలు నిర్వహించారు.

➡️