స్టీల్‌ప్లాంట్‌పై మోడీ స్పందించకపోవడం దుర్మార్గం

  • విశాఖలో సిపిఎం నిరసనలు

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంతగనులు కేటాయిస్తామనిగానీ, ప్రయివేటీకరణ చేయబోమనిగానీ, కార్మికులకు, ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తామనిగానీ, సెయిల్‌లో విలీనం చేస్తామని గానీ ప్రధాని మోడీ ప్రస్తావించకపోవడాన్ని నిరసిస్తూ విశాఖలో గురువారం సిపిఎం ఆధ్వర్యాన పలుచోట్ల నిరసనలు తెలిపారు. సిపిఎం, సిపిఐ ఆధ్వర్యాన జగదాంబ జంక్షన్‌ నుంచి లేపాక్షి జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జగదాంబ జంక్షన్‌లో నిరసన తెలిపారు. సిపిఎం ఆధ్వర్యాన పాతగాజువాక జంక్షన్‌లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పెందుర్తిలో నల్ల జెండాలతో ఆందోళన చేశారు. మధురవాడలో ర్యాలీ, రాస్తారోకో, తాటిచెట్లపాలెంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జగదాంబ వద్ద ఆందోళనలో సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.గంగారావు, సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు మాట్లాడుతూ.. గతసారి మోడీ విశాఖ వచ్చిన తరువాత స్టీల్‌ప్లాంట్‌ను సగం నాశనం చేశారని, ఇప్పుడు వచ్చి పూర్తిగా నిర్వీర్యం చేయడానికి కుట్ర చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు రక్షిస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ఆ హామీ ఎమైందని ప్రశ్నించారు. మోడీ విశాఖ పర్యటన సందర్భంగా నక్కపల్లిలో కాలుష్యకారక బల్క్‌డ్రగ్‌ పరిశ్రమలు వద్దని, భూములు తీసుకున్న రైతులకు పరిహారం, ప్యాకేజీ ఇవ్వాలని ఆందోళన చేసిన రాజయ్యపేట గ్రామస్తులపై పోలీసులు నిర్బంధం ప్రయోగించడాన్ని నిరసిస్తూ అనకాపల్లి ఆర్‌డిఒ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కుపై రాష్ట్ర ప్రజల మనోభావాలను ఏమాత్రం గౌరవించకుండా మోడీ మరోసారి మోసం చేశారని విమర్శించారు. నక్కపల్లిలో బల్క్‌డ్రగ్‌ పార్కు ఏర్పాటును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. సబ్బవరం, అచ్యుతాపురం మండల కేంద్రాల్లోనూ సిపిఎం ఆధ్వర్యాన నిరసన తెలిపారు.

➡️