- పన్నుల వసూళ్లు పెరుగుదల
- మంత్రి నారాయణ
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మునిసిపాలిటీలు మరింత మెరుగ్గా పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి పి.నారాయణ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని స్కేల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లో గురువారం మునిసిపల్ కమిషనర్ల రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మునిసిపల్‌శాఖపై ప్రజల్లో సంతృప్తి శాతం పెరిగేలా మునిసిపల్ కమిషనర్లు పనితీరు ఉండాలన్నారు. మునిసిపల్ కమిషనర్లు శాలిడ్‌వేస్ట్, లిక్విడ్ వేస్ట్‌లతో పాటు తాగునీరు, స్ట్రీట్ లైట్‌లు, రోడ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పేదలను ఇబ్బంది పెట్టకుండా పన్నుల వసూళ్లు పెరిగేలా కృషి చేయాలని మంత్రి నారాయణ అధికారులకు సూచించారు. మునిసిపాలిటీల్లో ఎస్టాబ్లిష్‌మెంట్, మౌళిక వసతుల కల్పనలో ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. నెల్లూరు మునిసిపాలిటీలో 2014-19 సంవత్సరాల్లో పన్నుల వసూళ్లలో కొత్త విధానాన్ని అమలు చేశామన్నారు, ఫలితంగా రూ.1,067కోట్లు వసూలయ్యాయని చెప్పారు.. రెవెన్యూ ఖర్చుపోగా రూ.40కోట్లు మిగులు ఆదాయం అప్పట్లోనే తీసుకురాగలిగామన్నారు. 14-19 మధ్య కాలంలో తానే మునిసిపల్‌శాఖ మంత్రిగా పనిచేశానని, ఆ సమయంలో మునిసిపాలిటీల్లో ఒక్క రూపాయి కూడా పన్నులు పెంచలేదన్నారు. పురపాలక,పట్టణాభివృద్దిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్‌కుమార్ మాట్లాడుతూ నగరాల్లో 1.5కోట్ల జనాభా ఉందని, ఇది రాబోయో కాలంలో 2.5 కోట్లకు పెరుగుతుందని దాని ప్రకారం వసతులను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్వచ్చాంద్ర కార్పొరేషన్ ఎండి అనిల్‌కుమార్, మెప్మా ఎండి తేజ్‌భరత్, టిడ్కో ఎండి సునీల్‌కుమార్‌రెడ్డి, గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఎండి ఎంకెవి శ్రీనివాసులు ,పట్టణ ప్రణాళికా విభాగం డైరెక్టర్ విద్యుల్లత, పబ్లిక్ హెల్త్ ఇఎన్‌సి మరియన్న , మునిసిపల్ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.