మారిన పరిస్థితుల అధ్యయనంతో ప్రజా పోరాటాలకు మరింత పదును

సిపిఎం రాష్ట్ర మహాసభ ముగింపులో బివి.రాఘవులు

ప్రజాశక్తి – కామ్రేడ్‌ సీతారాం ఏచూరినగర్‌ (నెల్లూరు) : వివిధ వర్గాలు, తరగతుల ప్రజలపై సరళీకరణ విధానాల ప్రభావాన్ని అధ్యయనం చేసి, సమస్యలపై తగిన పద్ధతుల్లో ప్రజాందోళనలు నిర్వహించడంతోపాటు, పార్టీ సైద్ధాంతిక ఆలోచన పెంచడం ద్వారా ప్రజా పోరాటాలకు మరింత పదునుపెట్టాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు పిలుపునిచ్చారు. సరళీకరణ విధానాలు వేగవంతమైన నేపథ్యంలో సమస్యల రూపం మారిందని, వీటికి దీటైన రీతిలో పోరాటాలు చేయడం ద్వారానే ప్రజా పునాదిని పెంచుకోగలమని అన్నారు. నెల్లూరులో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర 27వ మహాసభలో చివరి రోజు సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారు. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిందని ఇటీవల ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారని గుర్తు చేశారు. ఆర్థిక పరిస్థితి దిగజారడంతో ప్రజల్లో నిరాశ, నిస్పహ పెరిగిపోతోందని అన్నారు. మరోవైపు మూడేళ్ల క్రితానికి, ప్రస్తుతానికి రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయన్నారు. కేంద్రంలోని బిజెపికి లొంగిపోయి గతంలో వైసిపి ప్రభుత్వం పనిచేయగా, ప్రస్తుతం టిడిపి నేరుగా జతకట్టి అధికారంలో ఉందన్నారు. జనసేన అధినేత మరో అడుగు ముందుకేసి బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ అనుసరిస్తున్న మతోన్మాద భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని విమర్శించారు. తిరుపతి లడ్డూ వివాదాన్ని చంద్రబాబు తెరపైకి తీసుకురాగా, పవన్‌ దానికి మరింత ఆజ్యం పోశారని విమర్శించారు. ఈ పరిణామాలను రాష్ట్రంలో మతోన్మాద శక్తులైన బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ వాడుకుంటున్నాయన్నారు. రాష్ట్రంలో పెరిగిన మతోన్మాద ప్రమాదాన్ని గుర్తించి వారి కుట్రలను తిప్పికొట్టాలన్నారు. మారిన సమస్యల స్వరూపాన్ని మరింత లోతుగా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి పోరాటాలను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లోనూ ఇటువంటి కృషి చేయాలన్నారు. ముఖ్యంగా నివాస ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజల జీవన విధానంలోని అన్ని పార్శ్యాలను స్పృశించాలని అన్నారు. ఆయా సమస్యలను బట్టి జోక్యం చేసుకోవాలని సూచించారు. ప్రజాపునాదిని పెంచుకోవడానికి అదే మార్గమన్నారు. మరోవైపు లౌకికవాదులు, ప్రగతిశీల శక్తులను కలుపుకుని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేక శక్తులను ఐక్యం చేయాలన్నారు. తద్వారా అస్థిత్వ వాదాన్ని తిప్పికొట్టవచ్చన్నారు. అంతర్జాతీయంగా మితవాద శక్తులపై ప్రతిఘటన పెరుగుతోందని వివరించారు. ఇటీవలి శ్రీలంక పరిణామాలను గుర్తు చేశారు. మహాసభ ఇచ్చిన స్ఫూర్తితో ద్విగుణీకృత ఉత్సాహంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు.

➡️