చైర్మన్ రవినాయుడు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : క్రీడల అభివృద్ధే అజెండాగా ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ(శాప్) కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలని ఆ సంస్థ చైర్మన్ తెలిపారు. క్రీడల అభివృద్ధి, సమ్మర్ క్యాంపుల నిర్వహణపై విజయవాడలోని తన కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. క్రీడా సంఘాలను సమన్వయం చేసుకుని రాష్ట్రంలో పెద్దఎత్తున క్రీడాపోటీలను నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని చెప్పారు. స్పోర్ట్స్ ఫెడరేషన్లు నిర్వహించే క్రీడలను రాష్ట్రంలోనే నిర్వహించేలా చర్యలు చేపట్టాలని, తద్వారా రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడా సౌకర్యాలు సమకూరుతాయని తెలిపారు. క్రీడల నిర్వహణకు అనుగుణంగా ప్రభుత్వం తరపున శాప్ కూడా అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని చెప్పారు. త్వరలో నిర్వహించనున్న సమ్మర్ క్యాంపులను సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ నెల 20వ తేది నాటికి అన్ని జిల్లాల డిఎస్‌డిఓలకు సమగ్ర సమాచారాన్ని పంపించాలని, పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకునేలా అదేశాలు జారీ చేయాలని చెప్పారు. జిల్లా స్థాయిలో సమ్మర్ క్యాంపుల నిర్వహణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు డిఎస్‌డిఓతో పాటు ప్రతి జిల్లాకు కోచ్‌ను నియమించాలని తెలిపారు. వేసవి శిబిరాలను విద్యార్ధులు కూడా సద్వినియోగం చేసుకునేలా చూడాలని తెలిపారు. క్రీడాయాప్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని, అందుకు అనుగుణంగా సిబ్బంది కసరత్తు చేయాలని చెప్పారు. క్రీడాకారులకు సంబంధించిన వివరాలన్నింటినీ యాప్‌లో నిక్షిప్తం చేయాలని తెలిపారు. యాప్‌లో లేని అసోసియేషన్లు, క్రీడాకారులకు సర్టిఫికెట్ల జారీలో ఇబ్బందులు పడతారని తెలిపారు.
