గోదావరిలో మునిగి తల్లీకుమారుడు మృతి

Jun 10,2024 21:35 #2 death, #godavari, #water

ప్రజాశక్తి – వేలేరుపాడు (ఏలూరు జిల్లా) : గోదావరిలో మునిగి ప్రమాదవశాత్తు తల్లీకుమారుడు మృతి చెందిన సంఘటన ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట చిన్నశెట్టి బజారుకు చెందిన 15 మంది సోమవారం ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కట్కూరులోని శివాలయానికి వచ్చారు. వారందరూ అక్కడ జల్లు స్నానాలు చేశారు. వారితో పాటు వచ్చిన అల్లంశెట్టి తేజశ్రీనివాస్‌ (23) గోదావరి నదిలో స్నానం చేసేందుకు దిగారు. స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తూ నీట మునిగారు. కుమారుడిని రక్షించేందుకు తల్లి నాగమణి (45) గోదావరిలో దిగగా ఇద్దరూ గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టగా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

➡️