పిల్లలను నీటిలో తోసి తల్లి ఆత్మహత్యాయత్నం

  • తల్లీ, కుమారుడు క్షేమం
  • కుమార్తె గల్లంతు

ప్రజాశక్తి-వంగర (విజయనగరం జిల్లా) : ఆర్థిక సమస్యల కారణంగా ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి మడ్డువలస కుడి కాలువలో దూకి మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వంగర మండలం కింజంగి గ్రామానికి చెందిన శ్రావణితో బలిజిపేట మండలం గంగాడ గ్రామానికి చెందిన కళింగ సుధాకర్‌కు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి తొమ్మిదేళ్ల కుమారుడు సిద్ధు, ఏడేళ్ల కుమార్తె కళింగ సైనీ ఉన్నారు. సుధాకర్‌ మానసిక స్థితి కోల్పోవడంతో ఐదేళ్ల క్రితం శ్రావణి తన పిల్లలను తీసుకొని తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయారు. మూడు రోజుల క్రితం బురద వెంకటాపురంలోని బంధువుల ఇంటికి పిల్లలతో కలిసి వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో మడ్డువలస కాలువ వద్దకు చేరుకున్నారు. ముందుగా పిల్లలను కాలువలో తోసేసి, ఆమె కూడా దూకారు. అటువైపుగా చేపల వేటకు వెళ్తున్న జగన్‌మోహన్‌ చూసి కాలువలో దూకి శ్రావణి, సిద్దును కాపాడి ఒడ్డుకు చేర్చి పోలీసులకు సమాచారమిచ్చారు. బాలికను కాపాడే ప్రయత్నం చేస్తుండగా… ఒడ్డున ఉన్న శ్రావణి తన కుమారుడిని తీసుకొని మళ్లీ నీటిలో దూకారు. జగన్‌ మళ్లీ వారిని రక్షించారు. ఆ ప్రయత్నంలో బాలిక గల్లంతైంది.

➡️