మాట వినలేదని కుమార్తెను కడతేర్చిన తల్లి

Apr 12,2025 23:07 #chitoor, #Hatya
  • నిఖితది కులదురహంకార హత్యే : చంద్రగిరి డిఎస్‌పి

ప్రజాశక్తి – రామచంద్రాపురం (చంద్రగిరి) : తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నర్సింగాపురంలో మృతి చెందిన బాలికది అనుమానాస్పద మృతి కాదని, తమ దర్యాప్తులో కులదురహంకార హత్యగా తేలిందని చంద్రగిరి డిఎస్‌పి ప్రసాదరావు, సిఐ సుబ్బరామిరెడ్డి చెప్పారు. చంద్రగిరి పోలీస్‌ స్టేషన్‌ నిర్వహించిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వారు వెల్లడించారు. నర్సింగాపురం గ్రామంలో నివసిస్తున్న బిసి సామాజిక తరగతికి చెందిన నిఖిత (16) తమ పక్క గ్రామమైన మిట్టపాలెం దళిత వాడకు చెందిన అజరుతో ప్రేమలో పడి గర్భం దాల్చడంతో తల్లి సుజాత బలవంతంగా అబార్షన్‌ చేయించింది. అజరుతో కలిసి తిరగకూడదని కుమార్తెను మందలించినా మాట వినకపోవడంతో అజరుపై పోలీసులకు ఫిర్యాదు చేసి పోక్స్‌ కేసు పెట్టారు. ఈ కేసులో అజరు జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో అతనిని రెండుసార్లు కలిసిందని బాలిక తల్లి గ్రహించింది. దీంతో తన కుమార్తెను కడతెర్చేందుకు సిద్ధమైంది. కాళ్లుచేతులు కట్టేసి నోరు అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి నిఖితను మూడురోజుల క్రితం కడతేర్చింది. కుమార్తె విషయం ఎవ్వరికీ చెప్పకుండా బంధువుల సాయంతో ఖననం చేసింది. గ్రామస్తులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నర్సింగాపురం గ్రామా రెవెన్యూ అధికారి అశోక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి తల్లిని విచారించగా.. తన మాటను ధిక్కరించినందుకే కుమార్తెను హత్య చేసినట్లు ఆమె ఒప్పుకున్నారు. సుజాతను పోలీసులు అరెస్టు చేశారు.

➡️