సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం

Apr 14,2025 23:07 #AV Nageswararao, #bankers, #CITU, #Dharna
  • బ్యాంకు ఉద్యోగుల ధర్నాలో నాగేశ్వరరావు

ప్రజాశక్తి-విజయవాడ : తమ సమస్యలు పరిష్కారించాలని డిమాండ్‌ చేస్తూ యూనియన్‌ బ్యాంక్‌లో పనిచేస్తున్న తాత్కాలిక, క్యాజువల్‌ ఉద్యోగులు అల్‌ ఇండియా యూనియన్‌ బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ పిలుపు మేరకు విజయవాడ ధర్నా చౌక్‌లో సోమవారం ధర్నా చేశారు. ముందుగా డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు, బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ అజరుకుమార్‌, బ్యాంక్‌ ఉద్యోగులు, ఇతర నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానుద్దేశించి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బ్యాంక్‌ ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి సిఐటియు అండగా నిలుస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఉద్యోగులను భర్తీ చేయకుండా, ఖాతాదారులకు బ్యాంకు సేవలను దూరం చేస్తోందని విమర్శించారు. గత పది సంవత్సరాలుగా హౌస్‌ కీపర్స్‌ నియామకాలు జరగనందున ఉన్న ఉద్యోగులపై అదనపు పని భారం పడుతోందన్నారు. 2020 ఏప్రిల్‌ 1న యూనియన్‌ బ్యాంక్‌లో కార్పొరేషన్‌ బ్యాంక్‌, ఆంధ్రా బ్యాంక్‌ విలీనమైన తర్వాత దేశ వ్యాప్తంగా 2021 డిసెంబర్‌ ఒకటి నాటికి 9184 శాఖలకు గాను కేవలం 4895 హౌస్‌ కీపర్స్‌ మాత్రమే పని చేస్తున్నారని, 4289 హౌస్‌ కీపర్స్‌ పోస్ట్‌లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వీటితో పాటు వేలాది ఆఫీస్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ ఖాళీలలో తాత్కాలిక, క్యాజువల్‌ ఉద్యోగులు నియమించుకుని వారికి అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారని తెలిపారు. అజరుకుమార్‌ మాట్లాడుతూ… యూనియన్‌ బ్యాంక్‌లో ఏళ్ల తరబడి పని చేస్తున్న తాత్కాలిక, క్యాజువల్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదని, విధిలేని పరిస్థితుల్లో వారందరూ ఉద్యమ బాట పట్టాల్సి వచ్చిందన్నారు. వీరి సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోకపోతే సంఘటితంగా ఉద్యమించాల్సి వస్తోందని హెచ్చరించారు. నేటికీ ఉద్యోగులు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారన్నారు. తాత్కాలిక, క్యాజువల్‌ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని, కనీస వేతనం, బోనస్‌ ఇవ్వాలని బ్యాంకు యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు. ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జాయింట్‌ సెక్రటరీ సిహెచ్‌ కళాధర్‌, రైల్వే కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యదర్శి నరసింహులు ఈ ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విజయవాడ జోన్‌ పరిధిలోని టెంపరరీ ఉద్యోగులతో పాటు వారి కుటుంబసభ్యులు, యూనియన్‌ బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ సభ్యులు పాల్గొన్నారు.

➡️