- కారు, ఫ్లెక్సీలు, ఇతర వస్తువులు ధ్వంసం
ప్రజాశక్తి – ప్రత్తిపాడు (కాకినాడ జిల్లా) : కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని మాజీ మంత్రి, వైసిపి నాయకులు ముద్రగడ పద్మనాభం ఇంటిపై యువకుడు దాడి చేశాడు. ఆదివారం తెల్లవారుజాము నాలుగు గంటల సమయంలో ముద్రగడ ఇంటి ఆవరణంలోకి ట్రాక్టర్‌తో వచ్చి పలు వస్తువులను ధ్వంసం చేశాడు. కారును ట్రాక్టర్‌తో ఢకొీట్టాడు. ఫ్లెక్సీలను ధ్వంసం చేశాడు. శబ్ధం రావడంతో ఇంటి నుంచి బయటకు వచ్చిన ముద్రగడ పద్మనాభం చూసి యువకుడు పారిపోయేందుకు ప్రయత్నించగా ఆయన అనుచరులు యువకుడిని పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం గంగాధర్‌ను కాకినాడ జిజిహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. పిఠాపురం నియోజకవర్గం మంగుతుర్తికి చెందిన గనిశెట్టి గంగాధర్ తన అమ్మమ్మ గ్రామమైన కిర్లంపూడి పంచాయతీ పరిధిలోని జగపతినగరంలో నివాసం ఉంటున్నాడు. గ్రామంలో జనసేన నాయకునిగా ఉన్నాడు. ఘటనా స్థలాన్ని పెద్దాపురం డిఎస్‌పి శ్రీహరిరాజు, జగ్గంపేట సిఐ వైఆర్‌ఎ.శ్రీనివాస్, ఎస్‌ఐ జి.సతీష్ పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎస్‌పి మాట్లాడుతూ.. నిందితుడిపై కేసు నమోదు చేశామని, దాడికి కారణాలను తెలుసుకుంటున్నామని తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే వైసిపి కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు, మాజీ మంత్రులు దాడిశెట్టి రాజా, చెలుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జక్కంపూడి రాజా, మాజీ ఎంపి వంగా గీత కిర్లంపూడి చేరుకున్నారు. ముద్రగడను కలిసి జరిగిన ఘటనపై ఆరా తీశారు. అనంతరం కురసాల కన్నబాబు విలేకరులతో మాట్లాడుతూ ముద్రగడ ఇంటిపై జరిగిన దాడికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి చెల్లిబోయిన వేణు మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాడులు పెరిగాయని తెలిపారు. అయినా, ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. పద్మనాభం ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.