81శాతం పైనే పోలింగ్‌ : ఇసి అంచనా

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 81శాతంపైనే పోలింగ్‌ జరిగిఉంటుందని ఎన్నికల కమిషన్‌ అంచనా వేస్తోంది. తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మంగళవారం మాట్లాడిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ముఖేష్‌ కుమార్‌ మీనా ఈ విషయం తెలిపారు. ఓటు వేయడానికి ఓటర్లు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారని, కొన్ని నియోజకవర్గాల్లో మంగళవారం తెల్లవారు జాము రెండు గంటల వరకు పోలింగ్‌ జరుగుతూనే ఉందని చెప్పారు. దీంతో మంగళవారం సాయంత్రానికి కూడా పోలింగ్‌కు సంబంధించి పూర్తిస్థాయి నివేదికలు అందలేదని అన్నారు. అయితే భారీ స్థాయిలో పోలింగ్‌ జరిగిఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. సోమవారం రాత్రి 12గంటల వరకు 78.25 శాతం పోలింగ్‌ నమోదైందని, పోస్టల్‌ బ్యాలెట్‌ 1.2శాతం తో కలుపుకుని 79.4శాతం నమోదైందన్నారు. వివిధ జిల్లాల నుండి త అందుతున్న సమాచారం మేరకు 81.3శాతం శాతం పోలింగ్‌ నమోదై ఉంటుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. తుది నివేదిక చేరిన వెంటనే అధికారికంగా పోలింగ్‌ పర్సెంటీజీని వెల్లడిస్తామన్నారు. విశాఖ.శ్రీకాకుళం, సత్యసాయి,. మచిలీపట్నం, నెల్లూరు, తూర్పుగోదావరి,అనంతపురం జిల్లాల్లోని 47చోట్ల మంగళవారం వేకువజాము వరకు పోలింగ్‌ జరిగినట్లు ఆయన చెప్పారు.

ఓటర్ల కోసం గ్రీన్‌ఛానెల్‌లో రైలు
కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా మొదటిసారి ఓటు కోసం ఒక ట్రెయిన్‌కు గ్రీన్‌ ఛానెల్‌ సౌకర్యాన్ని క ల్పించినట్లు సిఇఓ మీనా వెల్లడించారు. పోలింగ్‌ సమయానికి రైలు విశాఖకు చేరుకునే పరిస్ధితి లేక పోవడంతో నాందేడ్‌ నుంచి విశాఖపట్నం బయలు దేరిన రైలులో ఉన్న రెండు వేల మంది ఓటువేయలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. ఈ విషయం కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లిందని, సిఇసి ఆదేశాల మేరకు రైల్వే శాఖతో మాట్లాడి, ఆ రైలుకు గ్రీన్‌ ఛానెల్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. దీంతో పోలింగ్‌ సమయానికంటే ముందుగానే ఆ రైలు విశాఖకు చేరుకుందని తెలిపారు. అడిషనల్‌ సిఇఓ కోటేశ్వరరావు ఈ మొత్తం వ్యవహారాన్ని సమన్వయం చేశారని చెప్పిన సిఇఓ, ఆయనను అభినందించారు.

➡️