రాగల రోజుల్లో బహుముఖ ఉద్యమాలు

  • జమిలి ఎన్నికలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
  • బిజెపి వ్యతిరేక శక్తులను ఒక వేదికపైకి తేవాలి
  • విశాఖ జిల్లా మహాసభలో వి.శ్రీనివాసరావు

ప్రజావక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మూడేళ్లుగా చారిత్రక పోరాటం సాగుతోందని, కార్మిక సంఘటిత శక్తికి ఏ పాలకుడైనా తలొగ్గాల్సిందేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ జిల్లా పెందుర్తి-సుజాత నగర్‌లో జరిగిన సిపిఎం 24వ మహాసభ రెండోరోజు ఆదివారం ప్రతినిధుల సభలో వి.శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, సీనియర్‌ నాయకులు సిహెచ్‌.నర్సింగరావు, ఉత్తరాంధ్ర పట్టభద్రుల మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌.శర్మ తమ సందేశాలిచ్చారు. ఈ సందర్భంగా వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రధాని మోడీ మూడేళ్లుగా ప్రయివేటీకరణపై అడుగు వేయలేకపోవడానికి కారణం కార్మిక పోరాటం వెనుక సిపిఎం ఉండటమేనని తెలిపారు. తాజాగా డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రతిపాదన ముందుకు తెస్తున్నారని, రాగల రోజుల్లో మరింత సమరశీలంగా పోరాడాలని సిపిఎం శ్రేణులకు పిలుపునిచ్చారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం జమిలి ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని, ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అనే బిజెపి నినాదంలో భారతీయ సహజసిద్ధమైన వారసత్వాన్ని చీల్చే కుట్ర దాగి ఉందని వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థ జిడిపి 6.7 శాతం నుంచి రెండున్నర శాతం తగ్గిపోయినా మోడీ వికసిత భారత్‌ అనడం, రాష్ట్రంలో చంద్రబాబు విజన్‌-2047 అనడం ఎవర్ని మోసగించడానికని ప్రశ్నించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తాజా బడ్జెట్‌లో రూ.24 వేల కోట్లు తగ్గించారని తెలిపారు. దేశంలో సనాతన ధర్మం పేరుతో చట్టాల్లో మార్పు తెచ్చి ప్రార్థనా స్థలాల స్వతంత్రతను దెబ్బతీస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో బిజెపి వ్యతిరేక శక్తులు ఒకేతాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

విశాఖలో కమ్యూనిస్టు ఉద్యమానికి విద్యార్థి ఉద్యమం ఎలా తోడ్పాటునిచ్చిందన్న అంశాలను సిపిఎం సీనియర్‌ నాయకులు సిహెచ్‌.నర్సింగరావు ప్రతినిధుల సభలో వివరించారు. నివాసిత ప్రాంతాల్లో స్థానిక ప్రజా, కార్మిక సమస్యలపై కృషి చేయడం ద్వారా ప్రజా పునాది పెరుగుతోందని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌.శర్మ మాట్లాడుతూ.. నయా ఉదారవాదం, హిందుత్వ విద్వేష రాజకీయాలను ఎదుర్కొవాలంటే ప్రజల సాంస్కృతిక వ్యవహారాల్లో జోక్యం పెరగాల్సి ఉందన్నారు. మానవత్వానికి సంబంధించిన సంస్కృతిని ప్రజల్లోకి వివిధ కళారూపాల్లో తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శిగా ఎం.జగ్గునాయుడు

జిల్లా మహాసభలో 24 మంది సభ్యులతో నూతన కమిటీ ఎన్నికైంది. సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శిగా ఎం.జగ్గునాయుడు, కార్యదర్శివర్గ సభ్యులుగా డాక్టర్‌ బి.గంగారావు, ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, బి.పద్మ, కెఎం.శ్రీనివాస్‌, బి.జగన్‌, పి.మణి, వి.కృష్ణారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

➡️