మున్సిపల్‌ ఉప ఎన్నికలు వాయిదా వేయాలి : వైసిపి డిమాండ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అప్రజాస్వామ్యకంగా జరుగుతున్న మున్సిపల్‌ ఉప ఎన్నికలను తక్షణమే వాయిదా వేయాలని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్‌ చేశారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వివిధ మున్సిపల్‌ కార్పొరేషన్ల డిప్యూటీ మేయర్‌, మున్సిపల్‌ ఛైర్మన్లు, వైస్‌ ఛైర్మన్ల ఎన్నికల్లో టిడిపి దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్‌ తక్షణం స్పందించాలని కోరారు. దాడులు, కిడ్నాప్‌లు, అరాచకాలకు తెలుగుదేశం పార్టీ తెగబడుతున్న నేపథ్యంలో ప్రజాస్వామ్యకంగా ఎన్నికల నిర్వహణ సాధ్యమా? అని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులు వైసిపి కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ప్రలోభపెట్టడం, లొంగని పక్షంలో భయపెట్టడం, అయినప్పటికీ మాట వినకపోతే దాడులు, కిడ్నాప్‌లకు తెగబడుతున్నారని అన్నారు. తిరుపతిలో వైసిపి కార్పొరేటర్‌ శేఖర్‌రెడ్డి ఇంటిపై బుల్డోజర్‌తో దాడి చేయించారన్నారు. మేయర్‌ శిరీష వాహనంపై కర్రలు, రాళ్లతో దాడి చేశారన్నారు. హిందుపూర్‌లో వైసిపి కౌన్సిలర్‌ను కిడ్నాప్‌ చేశారని పేర్కొన్నారు. పోలీసులు కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యారని చెప్పారు. తిరుపతిలో అరాచకాలకు తెరలేపారని అన్నారు. మెజార్టీ లేని చోట్ల కూడా టిడిపి పోటీ చేసి దౌర్జన్యాలకు దిగినట్లు ఆరోపించారు.

➡️