ప్రజాశక్తి – పాలకొల్లు (పశ్చిమగోదావరి జిల్లా) : రాష్ట్రంలోని టిడ్కో గృహాల సముదాయంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పలు అభివృద్ధి పనులను మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ఆయన ఆదివారం పరిశీలించారు. అనంతరం మీడియాతో నారాయణ మాట్లాడుతూ టిడ్కో గృహాలను వైసిపి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, మంజూరైన ఇళ్లు కూడా తగ్గించిందని విమర్శించారు. టిడ్కో గృహాలను నిర్మించిన కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించలేదని.. ఆ కాంట్రాక్టర్లు ఇప్పుడు బిల్లుల కోసం తిరుగుతున్నారని తెలిపారు. పాలకొల్లులో ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయిలను ఏర్పాటు చేస్తామన్నారు. పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్‌లను జగన్ ఎందుకు మూసివేశారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని.. అయినా, ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా దీపావళికి మూడు గ్యాస్ సిలిండర్లు అందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. పాలకొల్లు పట్టణాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. టిడ్కో గృహాలను జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు త్వరలోనే అందిస్తామని తెలిపారు.