- రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన
ప్రజాశక్తి-యంత్రాంగం : రాష్ట్ర వ్యాప్తంగా ఆప్కాస్‌లో పని చేస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ (కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్) కార్మికులందరిని పర్మినెంట్ చేయాలని, జిఒ 36 ప్రకారం వేతనాలు రూ.21 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల కార్మికులు నిరసనలు తెలిపారు. కార్మికుల సంఖ్యను పెంచి పని భారం తగ్గించాలని, మృతి చెందిన పారిశుధ్య కార్మికుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ ఎదుట ధర్నా చేశారు. తమ సమస్యల పట్ల అధికారులు నిర్లక్ష్యం విడనాడాలని, సమస్యలు పరిష్కరించాలని ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. నగర పాలక సంస్థ కార్యాలయ ఎదుట బైటాయించి ధర్నా చేశారు. సుమారు 7 గంటలపాటు కార్యాలయం ఎదుట కార్మికులు బైఠాయించారు. పోలీసుల జోక్యంతో అడిషనల్ కమిషనర్ నందన్ కార్పొరేషన్ కార్యాలయం చేరుకొని యూనియన్ నాయకులు కార్మికులతో మాట్లాడారు. సమస్యలను పరిష్కరించేందుకు నెల రోజులు గడువు ఇవ్వాలని కోరడంతో కార్మికులు ఆందోళన విరమించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస, ఇచ్ఛాపురం మున్సిపాల్టీ కార్యాలయాల వద్ద కార్మికులు ధర్నా చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్లకు వినతి పత్రాలు అందజేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మున్సిపల్ కార్యాలయం, అనంతపురం నగర పాలకసంస్థ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.