సాలూరులో మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Jun 10,2024 22:06 #Dharna, #muncipal workers, #Nellor
  • కార్యాలయం వద్ద శిబిరం

ప్రజాశక్తి – సాలూరు (పార్వతీపురం మన్యం జిల్లా) : తమ సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో సోమవారం నుంచి కాంట్రాక్టు కార్మికులు విధులు బహిష్కరించి, సమ్మె బాటపట్టారు. కార్మికులకు వేతనాలు చెల్లించాలంటూ గతంలో మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ పట్టణ కమిటీ ఆధ్వర్యాన కార్మికులు దశలవారీగా ఆందోళన చేపట్టారు. అయినా సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మె బాట పట్టారు. ఈ సమ్మెలో ఫెడరేషన్‌ నాయకులు టి శంకరరావు, టి రాముడు మాట్లాడుతూ ఈ ఏడాది జనవరికి సంబంధించిన వెయ్యి రూపాయల పండుగ ఖర్చులు, వేతన బకాయిలు, డ్రైవర్లకు రూ.24,500 వరకు పెంచిన వేతనాలు అమలు చేయాలని, మరణించిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలివ్వాలని డిమాండ్‌ చేశారు. తమ సమస్యల పరిష్కారం పట్ల మున్సిపల్‌ కమిషనర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. గత రెండు నెలలుగా సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేపడుతున్నామని, అయినా అధికారుల్లో స్పందన కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫెడరేషన్‌ నాయకులు టి వెంకటరావు, శ్రామిక మహిళా కన్వీనర్‌ టి ఇందు పాల్గొన్నారు.

➡️