ఫూలే దంపతులను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలి : వి.శ్రీనివాసరావు
ప్రజాశక్తి- నెల్లూరు : జ్యోతిరావు ఫూలే దంపతులను ఆదర్శంగా తీసుకొని సామాజిక వివక్షతకు, అసమానతలకు వ్యతిరేకంగా నేటి తరం పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపుని చ్చారు. నెల్లూరులోని జ్యోతిరావు ఫూలే విగ్రహానికి శుక్రవారం ఆయన పూలమాల వేసి నివాళి అర్పిం చారు. జ్యోతిరావు ఫూలే జయంతిని పురస్కరించు కొని సిపిఎం నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో వి.శ్రీనివాసరావు మాట్లాడారు. అంటరానితనం, నిరక్షరాస్యత, సామాజిక వివక్షత ఉన్నంత వరకూ జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతులు ప్రజల హృదయాల్లో సజీవంగా ఉంటారన్నారు. ఆ రోజుల్లోనే ఆధిపత్య వాదానికి వ్యతిరేకంగా అన్ని సామాజిక తరగతుల్లోని అణగారిన వర్గాలను ఫూలే దంపతులు కూడగట్టారని గుర్తు చేశారు. విద్యతోనే ఈ విముక్తి సాధించగలమని గట్టివాదాన్ని సమాజానికి వినిపించిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు ఫూలే అని తెలిపారు. విముక్తి కోసం పోరాడాలని దళితులకు పిలుపునిచ్చారన్నారు. అటువంటి వ్యక్తిని నేటితరం యువత ఆదర్శవంతంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జ్యోతిరావు ఫూలే ఆదర్శాలను పాలకులు మట్టిలో కలిపేశారని వివరించారు. మహోన్నతమైన దంపతుల ఆదర్శాలను సమాధి చేసి కేవలం వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించినంత మాత్రాన సరిపోదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం సనాతన ధర్మం పేరుతో కులవ్యవస్థకు లేని గౌరవాన్ని ఆపాదించి, దానిని పునరుద్దరించి అంటరానితనాన్ని సనాతన ధర్మం పేరుతో కాపాడే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. దళితులకు, గిరిజనులకు, వారి విజ్ఞానానికి, చదువుకొనేందుకు ఉన్న అవకాశాలను తగ్గించేస్తోందన్నారు. అమెరికా ప్రభుత్వం మనదేశ ప్రజలపై విచ్చలవిడిగా ఆంక్షలు పెడుతున్నా నోరు మెదపకుండా దేశ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. ఇటువంటి ఆంక్షలు ఆనాటి బ్రిటీష్ పాలనలో ఉంటే వాటిని ఎదిరించి నిలబడిన స్వాతంత్య్రోద్యమ నాయకులకు ద్రోహం చేయడం సరికాదన్నారు. కులవివక్షకు, అంటరానితనానికి, నిరక్షరాస్యతకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాన్ని చేపట్టి వాటన్నింటినీ నిర్మూలించిన రోజే ఫూలే దంపతులకు నిజమైన జోహార్లు అర్పించినట్టు అని తెలిపారు. నేటికీ తీవ్రమైన రూపాల్లో గ్రామాల్లో, పట్టణాల్లో కులవివక్ష కొనసాగుతోందని వివరించారు. జ్యోతిరావు ఫూలే దంపతులకు నివాళి అర్పించే అర్హత కేంద్ర ప్రభుత్వానికిగానీ, బిజెపి మిత్రపక్షాలకుగానీ లేదన్నారు. ఇటువంటి పాలకులను ఇంటికి పంపినప్పుడే దేశం ముందడుగు వేస్తుందన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ విద్యను ప్రతి ఒక్కరికీ అందించాలన్న ఆశయంతో ఫూలే దంపతులు అడుగులు వేశారని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.