భారీగా పెరిగిన మటన్ ధరలు
కిలో రూ.800 నుంచి రూ.1,000
బర్డ్‌ఫ్లూ తో తగ్గిన చికెన్ అమ్మకాలు
సొమ్ము చేసుకుంటున్న మటన్ వ్యాపారులు
ప్రజాశక్తి – రాజోలు (కోనసీమ జిల్లా) : కోనసీమ జిల్లా వ్యాప్తంగా మటన్ అమ్మకాలు భారీగా జరిగాయి. సుమారు రూ.5 కోట్ల వ్యాపారం జరిగి ఉంటుందని అంచనా. చాలాచోట్ల విక్రయదారులు ధర పెంచి అమ్మకాలు సాగించారు. బర్డ్ ప్లూ భయంతో చికెన్ ప్రియులు భారమైనా ఎక్కువ మంది మటన్ కొనుగోలు చేయడం కనిపించింది. ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకున్నారు. చాలాచోట్ల కిలో మటన్‌ను రూ.1,000ల వరకూ విక్రయిస్తున్నారు. ఆదివారం ప్రధాన మార్కెట్లలో మటన్ విక్రయాలు రూ.లక్షల్లో జరిగాయి. అమలాపురం, మలికిపురం, రాజోలు, రావులపాలెం వంటి ప్రాంతాల్లో మటన్ ధరలు చుక్కలనంటాయి. మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాలో సైతం విపరీతమైన గిరాకీ. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది బృందంగా ఏర్పడి ముందుగానే మేక, పొట్టేళ్లను ముందస్తుగానే సంతల్లో కొనుగోలు చేసుకున్నారు. కోళ్ల విక్రయాలు మాత్రం గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్ ఇందుకు కారణం. కోడి మాంసంతో బర్డ్‌ఫ్లూ ప్రబలుతోందన్న వదంతుల నేపథ్యంలో చాలామంది భయపడిపోయారు. సామాన్య, మధ్యత రగతి ప్రజలు సైతం ప్రత్యామ్నాయంగా చేపలు, మటన్‌పైనే ఆసక్తికనబరిచారు. ఫలితంగా అమ్మకాలు లేక కోడి మాంసం విక్రయదారులు డిలా పడిపోయారు. నాటుకోళ్ల అమ్మకాలు మాత్రం ఆశాజనకంగా జరిగాయి. ఇక చేపల విక్రయాలదీ అదే తీరు. చేపల కోసం జనాలు ఎగబడ్డారు. లైవ్ ఫిష్ పేరిట ఏర్పాటుచేసి దుకాణాల వద్ద ఉదయానికే మోహరించారు.
సామాన్యులకు దూరం
గత కొద్ది సంవత్సరాలుగా ధరలు బాగా పెరుగుతూ వస్తుండటంతో సామాన్యులు మటన్ కొనాలంటే జంకుతున్నారు. మేక మాంసం కొనే స్తోమత లేక చికెన్తోనే సరిపెట్టుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అరకొరగా మాత్రమే మటన్ కొంటున్నారు. బర్డ్ ప్లూ నేపథ్యంలో ధరలు భారీగా పెరగడంతో పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు మటన్‌కు దూరమవుతున్నారు.జిల్లాలొ గత కొంతకాలం గా కొన్ని ప్రాంతాల్లో మటన్ కిలో ధర రూ.వెయ్యి దాటినా తర్వాత దిగివచ్చింది. బర్డూను బూచిగా చూపి అప్పట్లో కొంతమంది వ్యాపారులు అడ్డగోలుగా రేట్లు పెంచేశారు. దీంతో మటన్ ధరలు ఆకాశాన్నంటాయి.
మాంసాహారులే ఎక్కువ
దేశంలో మాంసాహారులు పెరుగుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫెచ్‌ఎస్)-5 వెల్లడించింది. అధిక శాతం ప్రజలు వారానికి కనీసం ఒకసారి చేపలు, చికెన్, మాంసంలో ఏదో ఒక దానిని కచ్చితంగా ఆరగిస్తున్నారని తెలిపింది. అయితే మటన్ వినియోగంలో ఆంద్రప్రదేశ్ దేశంలోనే టాప్లో ఉంది. 70 శాతం మంది ప్రజలు కనీసం వారంలో ఒకసారైనా మాంసం తింటున్నారు. కేవలం 4.4 శాతం మంది ఎటువంటి మాంసాహారం ముట్టకుండా కోడిగుడ్డు మాత్రమే తీసుకుంటున్నారు. 0.27 శాతం మంది మాత్రమే వెజిటేరియనన్లు ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇక చూపు చేపల వైపు
మాంసాహార ప్రియులు చికెన్, మటన్ ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో చేపల కొనుగోలు వైపు మొగ్గుచూపుతున్నారు. చేపల ధరలు కిలోకి రూ.120-150 కే అందుబాటులో ఉండడంతో వీటివైపు ప్రజలు ఆసక్తిచూపుతున్నారు.