ఎపి అభివృద్ధికి నా వంతు కృషి

  • కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల శాఖ మంత్రి చీరాగ్‌ పాశ్వాన్‌

ప్రజాశక్తి – మంగళగిరి (గుంటూరు జిల్లా) : ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని లోక్‌ జనశక్తి (రామ్‌ విలాస్‌) పార్టీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌ తెలిపారు. చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన ఆయన మంగళగిరిలోని లోక్‌ జనశక్తి పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని బుధవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో చిరాగ్‌ పాశ్వాన్‌ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తన తండ్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌కు మంచి అనుబంధం ఉందన్నారు. అదే బాటను తాను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు మంచి విజన్‌ ఉన్న నాయకుడని కొనియాడారు. పవన్‌ కల్యాణ్‌ తనకు మంచి మిత్రుడని తెలిపారు. కూటమికి అభినందనలు తెలిపారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ ఆశయ సాధనకు అనుగుణంగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తానని అన్నారు. క్యాబినెట్‌ మంత్రిగా తొలిసారిగా మంగళగిరి రావటం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చందోలు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు చింత వెంకటేశ్వర్లు కేంద్రమంత్రికి ఘన స్వాగతం పలికారు. శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

➡️