ధాన్యం సేకరించిన 48 గంటల్లో నగదు చెల్లింపు : నాదెండ్ల మనోహర్‌

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : రైతుల నుంచి ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే నగదు చెల్లింపులు చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఆ శాఖ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సదస్సులో పాల్గొనేందుకు ఆయన గురువారం విశాఖపట్నం వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ మీటింగ్‌ హాల్‌లో మంత్రి నాదెండ్ల విలేకరులతో మాట్లాడారు. ఖరీఫ్‌ సీజన్‌లో 37 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణను లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 1.51 లక్షల మంది రైతుల నుంచి 10.59 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామన్నారు. నేటికి రూ.2,331 కోట్లును రైతులకు చెల్లించామని తెలిపారు. కేవలం పది రోజుల్లో 6.63 లక్షల మెట్రిక్‌ టన్నులు కొన్నామన్నారు.

రేషన్‌ మాఫియాపై ఉక్కుపాదం

పేదలకు అందాల్సిన బియ్యాన్ని విదేశాలకు తరలిస్న్ను మాఫియాపై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని నాదెండ్ల తెలిపారు. రేషన్‌ బియ్యం తరలింపుపై చేసిన దాడులకు సంబంధించి 1,066 కేసులు నమోదు చేసి 729 మందిని అరెస్టు చేశామని, 102 వాహనాలను సీజ్‌ చేశామని వెల్లడించారు. అవసరమైతే పీడీ యాక్ట్‌ను ప్రయోగిస్తామని హెచ్చరించారు. అక్రమంగా తరలిస్తున్న 62 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సీజ్‌ చేశామని, మార్కెట్‌ విలువ సుమారు రూ.240 కోట్లు ఉంటుందని తెలిపారు. రేషన్‌ మాఫియా చేసే అక్రమాల తీవ్రతను గుర్తించి సిబిసిఐడి విచారణకు ఆదేశించామని పేర్కొన్నారు. మూడేళ్లలో 1.31 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం కాకినాడ పోర్టు నుంచి ఎగుమతయ్యాయని, అక్కడి ప్రాంతాన్ని స్మగ్లింగ్‌ డెన్‌గా తయారు చేసుకొని రాష్ట్రానికి, ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. ఈ సమావేశంలో సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ కమిషనర్‌ వీరపాండ్యన్‌, ఎమ్‌డి మంజిల్‌ జిలానీ పాల్గొన్నారు.

➡️