అమరావతి : ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన నేత నాగబాబు పేరు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారయ్యింది. ఎమ్మెల్యే కోటా అభ్యర్థిగా ఆయన పేరును జనసేన అధినేత పవన్ ఖరారు చేశారు. నామినేషన్ వేయాలని నాగబాబుకు ఆయన సమాచారం ఇచ్చారు. కొద్దిరోజుల కిందట ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు టిడిపి, ఒకటి బిజెపి తీసుకున్నాయి. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. పవన్ కల్యాణ్ కోరిక మేరకు తొలుత ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానం ఆయన కోసం కేటాయించారు. తీరా శాసనమండలి ఎన్నికల షెడ్యూలు వెలువడిన తరువాత నాగబాబుకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ, తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగానే నాగబాబు పేరును ఖరారు చేశారు.
