- ఏడాదిలోగా పనులు పూర్తి : శంకుస్థాపనలో మంత్రి లోకేష్
ప్రజాశక్తి- మంగళగిరి రూరల్ (గుంటూరు జిల్లా)
గుంటూరు జిల్లా మంగళగిరి వంద పడకల ప్రభుత్వాస్పత్రిని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి సమీపంలోని చినకాకాని వద్ద వంద పడకల ప్రభుత్వ వైద్యశాలకు మంత్రి ఆదివారం శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. వైవిసి (యార్లగడ్డ వెంకన్న చౌదరి) కేన్సర్ ఆస్పత్రికి 1984లో ఎన్‌టి రామారావు శంకుస్థాపన శిలాఫలకం వద్ద సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా మంగళగిరి ఆస్పత్రిని తీర్చిదిద్దుతామన్నారు. జోనింగ్, స్టాఫింగ్, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని, ఆర్థో, డయాలసిస్ సెంటర్‌ను అందుబాటులోకి తెస్తామని, తలసేమియా, డీ అడిక్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆస్పత్రి పనులను ఏడాదిలో పూర్తి చేసే బాధ్యత ఎపిఎంఎస్‌ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావుపై ఉందని, వంద పడకల ఆస్పత్రి సాధన కమిటీ సభ్యుల పర్యవేక్షణలో నిర్మాణం జరగాలని, నాణ్యతలో ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తామని తెలిపారు. మంగళగిరి స్వచ్ఛతతోపాటు అన్ని రంగాల్లో నంబర్ ఒన్ కావడానికి ప్రజల సహకారం కావాలని అన్నారు.
3,005 మందికి పట్టాల పంపిణీ
మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో 3,005 మందికి తొలి విడతగా శాశ్వత పట్టాలను మంత్రి లోకేష్ పంపిణీ చేశారు. మంగళగిరి సమీపంలోని డాన్ బాస్కో స్కూలు ఆవరణలో ఐదు రోజులపాటు చేపట్టిన పట్టాల పంపిణీ ఆదివారం ముగిసింది. రత్నాల చెరువులో 729 మందికి, మహానాడు-1లో 473, మహానాడు-2లో 441, యర్రబాలెంలో 274, కొలనుకొండలో 235, పెనుమాకలో 185, పద్మశాలి బజార్‌లో 137, డ్రైవర్స్ కాలనీలో 119, నీరుకొండలో 99, సలాం సెంటర్‌లో 92, ఉండవల్లిలో 82, ఉండవల్లి సెంటర్‌లో 85, సీతానగరంలో 48, ఇప్పటంలో పది మందికి పట్టాలను అందించారు.
టిడ్కో కాలనీలో వాటర్ ప్లాంట్ ప్రారంభం
మంగళగిరి పట్టణం టిడ్కో కాలనీలో వెయ్యి లీటర్ల సామర్థ్యంతో దివీస్ లేబొరేటరీస్ సంస్థ ఏర్పాటు చేసిన ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్‌ను లోకేష్ ప్రారంభించారు. వాటర్ క్యాన్‌ను నీటితో నింపి మహిళలకు అందజేశారు. కార్యక్రమాల్లో మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎపిఎంఎస్‌ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టిటిడి బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, తెనాలి సబ్‌కలెక్టర్ వి.సంజనా సిన్హా తదితరులు పాల్గొన్నారు.