ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ బాధ్యతలు స్వీకరించారు. మేళతాళాలతో సచివాలయానికి వచ్చిన మంత్రి నారాయణకు పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మీ స్వాగతం పలికారు. 2014-19 మధ్య కాలంలో మంత్రిగా ఏ ఛాంబర్‌లో విధులు నిర్వహించారో.. అదే ఛాంబర్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజధాని అమరావతి కోసం 32 వేల ఎకాలు ఎటువంటి లిటిగేషన్ లేకుండా సేకరించామని.. గత ప్రభుత్వం రాజధానిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. అలాగే ఏపీ ప్రజల శ్రేయస్సుకోసం అమరావతి రాజధానిని పూర్తి చేయడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తామని ఆయన తెలిపారు. రెండున్నర ఏళ్లలో అమరావతిని నిర్మించి దేశంలోని టాప్-5 రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
