ఆదివాసీల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం

Feb 22,2024 11:32 #Andhra Pradesh, #tribal health

ప్రజాశక్తి – సాలూరు

గిరిజన సంక్షేమ గురుకుల, ఏకలవ్య పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్య సేవలు అందించడానికి ఎఎన్‌ఎంలను నియమిం చారు. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్య సిబ్బంది అప్రమత్తమై సకాలంలో వైద్య సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. అదే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్య సమస్య వస్తే దిక్కూ దిమానా లేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడో, వార్డెనో అనారోగ్యానికి గురైన విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యసేవలు అందేలా చూడాలి. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణపై ఇంత తేడా కనబరచడం వివాదాస్పదమవుతోంది. మన్యం జిల్లాలో పార్వతీపురం ఐటిడిఎ పరిధిలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఎఎన్‌ఎంలను నియమించలేదు. గత ప్రభుత్వం హయాంలో ‘ఆదివాసీ ఆరోగ్యం’ అనే కార్యక్రమం కింద అన్ని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లోనూ ఆరోగ్య కార్యకర్తలను నియమించారు. పార్వతీపురం ఐటిడిఎ పరిధిలో 55 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, 16 పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహాలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఆరోగ్య కార్యకర్తల నియామకం చేపట్టారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఎఎన్‌ఎంలను నియామకానికి నీళ్లొదిలింది. ఇప్పుడున్న గురుకుల, ఏకలవ్య పాఠశాలల్లో ఎఎన్‌ఎంలను నియమించారు. ఏకలవ్య పాఠశాలల్లో అయితే ఇద్దరు చొప్పున ఎఎన్‌ఎంలు పని చేస్తున్నారు. మూడు రకాల పాఠశాలల్లో చదువుతున్నది ఆదివాసీ గిరిజన విద్యార్థులే. వారి భోజనం, వసతి సౌకర్యాలల్లో స్పష్టమైన తేడా చూపిస్తున్న ప్రభుత్వం వారి ఆరోగ్య పరిరక్షణలోనూ వివక్ష చూపడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రధానంగా మన్యం జిల్లాలో జరుగుతున్న విద్యార్థుల మరణాల్లో 90 శాతం పైగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న వారివే కావడం గమనార్హం. మారుమూల గిరిజన గ్రామాలకు చెందిన విద్యార్థులే ఎక్కువగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్నారు. ఈ ఏడాదిలో పార్వతీపురం ఐటిడిఎ పరిధిలో జరిగిన విద్యార్థుల మరణాల్లో ఎక్కువ మంది ఆశ్రమ పాఠశాలలకు చెందిన విద్యార్థులే ఉన్నారు.

మరణాలను అడ్డుకోలేరా?

గతేడాదిలో పదోతరగతి పరీక్షా ఫలితాల్లో మన్యం జిల్లా రాష్ట్ర స్థాయిలో ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించిన జిల్లాగా ఆవిర్భవించింది. ఈ ఘనత వెనుక తమ కృషి, పట్టుదల ఉందని మన్యం జిల్లా అధికారులు గొప్పలు చెప్పు కున్నారు. ఇప్పుడు విద్యార్థుల మరణాల్లోనూ జిల్లా దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో మరణాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టి సారించిన దాఖలాలు లేవు. చేతికంది వచ్చే పిల్లలు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతూ మృత్యువాత పడుతుండడంతో వారి తల్లిదండ్రులు గర్భశోకానికి గురవుతున్నారు. విద్యార్థుల మరణాలు లేని మన్యం జిల్లాగా పేరు తేవడానికి కృషి చేయాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి.

ఆరోగ్య కార్యకర్తలను నియమించాలి 

గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న ఏకలవ్య, గురుకుల పాఠశాలల్లో ఎఎన్‌ఎంలను నియమించిన ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలల్లో ఎందుకు నియమించలేదని గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాడంగి సాయిబాబు, ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్‌ కుమార్‌ ప్రశ్నించారు. మారుమూల గిరిజన ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్నారని, వివిధ అనారోగ్య కారణాలతో మరణాలు అక్కడే సంభవిస్తున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో ఆదివాసీ ఆరోగ్యం కింద ఆశ్రమ పాఠశాలల్లో ఆరోగ్య కార్యకర్తలను నియమించిందని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా ఆరోగ్య కార్యకర్తలను నియమించాలని కోరారు.

➡️