మాతృభాషను నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరం

  • కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ

ప్రజాశక్తి – రాజానగరం : మాతృభాషను నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరమని, మాతృభాషపై పట్టు ఉంటే మిగిలిన భాషలు వస్తాయనే నిజాన్ని గుర్తించాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా గోదావరి గ్లోబల్‌ విశ్వవిద్యాలయం (జిజియు) ప్రాంగణంలో చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న 2వ ప్రపంచ తెలుగు మహాసభ గురువారంతో ముగిసింది. జిజియు కులపతి కెవివి.సత్యనారాయణరాజు అధ్యక్షతన జరిగిన ముగింపు సభకు ముఖ్యఅతిథిగా శ్రీనివాసవర్మ, ప్రత్యేక అతిథులుగా మాజీ ఎంపి కనుమూరి బాపిరాజు, అన్నపూర్ణ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసవర్మ మాట్లాడుతూ.. మమ్మీడాడీ సంస్కృతి నుంచి అమ్మానాన్న అని పిలిపించుకునేలా విధానం మారాలన్నారు. ఎన్‌టిఆర్‌ తెలుగు భాషకు ప్రాధ్యాన్యత ఇచ్చారని, దాన్ని కొనసాగించాలని తెలిపారు. వ్యక్తిగతంగా, ప్రభుత్వ పరంగా తెలుగు భాష అభివృద్ధికి సహకరిస్తానని చెప్పారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణకు టిడిపి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దీని కోసం ఉత్తరాంధ్రలో, కోస్తాలో, రాయలసీమలో ఉన్న మాండలికాలను అధ్యయనం చేయించి గ్రంథస్తం చేయాలనే ఆలోచన చేస్తున్నామని ఎతలిపారు. తెలుగు భాషాభివృద్ధికి, వికాసానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. నంది నాటకోత్సవాలను మళ్లీ పునరుద్ధరిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి మాట్లాడుతూ తెలుగు భాషను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
ప్రాథమిక విద్యను పునరుద్ధరించి తెలుగు భాషాలోనే నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపి దగ్గుబాటి పురందేశ్వరి, పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ లంకా దినకర్‌, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, బండారు సత్యానందరావు, దాట్ల సుబ్బరాజు, , జిజియు ఉపకులపతి ఉదయగిరి చంద్రశేఖర్‌, జిజియు ప్రో ఛాన్సలర్‌ కె .శశికిరణ్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.
అలరించిన కార్యక్రమాలు
ద్విసహస్రావధాని డాక్టర్‌ మాడుగుల నాగఫణి శర్మ, శతావధాని కడిమెళ్ల వరప్రసాద్‌, కవి అందెశ్రీ తెలుగు పద్యాలు ఆలపించారు. వాటి అర్థాలను వివరించారు. తమిళనాడుకు చెందిన ప్రముఖ కవి అందెశ్రీ పాడిన ‘మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు’ అనే పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ తెలుగులో చెప్పిన కవిత్వం ఆహుతులను ఆకట్టుకుంది. చిన్నారుల సాంస్కతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం అతిథులును నిర్వాహకులు సత్కరించి జ్ఞాపికలు అందించారు.

➡️