నిర్లక్ష్యం, పాలనా వైఫల్యం

  • తిరుపతి ఘటనపై మాజీ మంత్రులు రోజా, అంబటి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : నిర్లక్ష్యం, పాలనా వైఫల్యం వల్లే తిరుపతిలో తొక్కిసలాట జరిగిందని, ప్రమాదాన్ని తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రులు ఆర్‌కె రోజా, అంబటి రాంబాబు తెలిపారు. గురువారం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఘటనపై పూర్తి పారదర్శకంగా దర్యాప్తు చేయాలని, నిందితులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కోరారు. తొక్కిసలాటకు కారకులైన వారికి శిక్ష పడేదాకా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోందని పేర్కొన్నారు. దీనిపై పోలీసులు బిఎన్‌ఎస్‌ 194 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారని, దాన్ని 105 కింద మార్చాలని డిమాండ్‌ చేశారు. కుప్పం పర్యటనలో జిల్లా అధికారులు ఆయన చుట్టూ తిరిగి తిరుపతిలో ఏర్పాట్లు మర్చిపోయారని అన్నారు. పిల్లలకు కనీసం పాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. హైదరాబాద్‌లో అల్లు అర్జున్‌ వెళ్లిన సినిమాలో మహిళ చనిపోతే ఆయన్ను బాధ్యుడిని చేశారని, ఇక్కడ కూడా అంతే చేయాలన్నారు. హైందవ శంఖారావం నిర్వహించిన పెద్దలు ఇప్పుడు బయటకు వచ్చి నిర్లక్ష్యంపై నిలదీయాలని అన్నారు. తొక్కిసలాట జరిగితే అధికారులపై సిఎం ఆగ్రహం వ్యక్తం చేయడం ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. టిటిడి ఛైర్మన్‌, ఇఓ, జెఇఓలను నియమించిందే చరద్రబాబునాయుడని, ఆయనే అధికారులపై నిందలు మోపి తప్పించుకోవాలని చూస్తున్నారని తెలిపారు. పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని రాజకీయ కేంద్రంగా మార్చారని విమర్శించారు. సనాతన ధర్మాన్ని కాపాడుతానన్న పవన్‌ ఏమయ్యాడని ప్రశ్నించారు. తిరుపతి ఎస్‌పి కూడా వైసిపి నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తూ తన విధులను మర్చిపోయాడని విమర్శించారు. ఇదే అంశంపై ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి, లిడ్‌క్యాప్‌ మాజీ ఛైర్మన్‌ కాకుమాను రాజశేఖర్‌ కూడా స్పందించారు. కేసు నమోదుచేసిన సెక్షన్లు మార్చాలని డిమాండ్‌ చేశారు. ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.

➡️