ఆశాల డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు -పలు అంశాలపై అంగీకారం

Feb 11,2024 08:35 #asa leaders, #press meet
  • సత్వరమే జిఓలు ఇవ్వాలిఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ డిమాండ్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఆశా వర్కర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో పలు అంశాలపై అంగీకారం కుదిరినట్లు ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర కమిటీ తెలిపింది. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.పోశమ్మ, కె.ధనలక్ష్మి బాలోత్సవ్‌ భవన్‌లో మీడియాతో శనివారం మాట్లాడుతూ ఒప్పందం కుదిరిన అంశాలకు సంబంధించి తక్షణమే జిఓలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. శుక్రవారం రాత్రి యూనియన్‌ ప్రతినిధులతో ప్రభుత్వం సమావేశం జరిపినట్లు వారు తెలిపారు. ప్రభుత్వం వైపు నుంచి కుటుంబ సంక్షేమశాఖ కమిషనరు జె.నివాస్‌, డైరెక్టర్‌ గణపతి చర్చల్లో పాల్గన్నారని తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో పలు అంశాల అమలుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. ప్రభుత్వ సెలవులు, మెడికల్‌ లీవ్స్‌, వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్‌ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందని, ప్రస్తుతం అమల్లో ఉన్న 26 రికార్డుల స్థానంలో నాలుగు రికార్డులకు సంబంధించిన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ప్రభుత్వం పేర్కొందన్నారు. పనిచేయని సెల్‌ ఫోన్‌ల స్థానంలో కొత్తవి ఇవ్వడంతోపాటు ప్రమాద బీమా కింద రూ.6 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. వయోపరిమితిని 60నుంచి 62 సంవత్సరాలకు పెంచడంతో పాటు విధి నిర్వహణలో మరణించిన ఆశ వర్కర్స్‌ కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారిని తిరిగి తీసుకునే అంశాన్ని ఆయా కేసులను బట్టి పరిశీలిస్తామని ప్రభుత్వం పేర్కొందన్నారు. ఆశ వర్కర్లు మరణించిన పక్షంలో వారి మట్టి ఖర్చుల కింద రూ.20 వేలు ఇవ్వనున్నట్లు తెలిపిందన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి, మెరిట్‌ లిస్ట్‌ను ప్రకటిస్తామని చెప్పారన్నారు. వీటితో పాటు పలు అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని అధికారులు తెలిపారని ఆశ వర్కర్స్‌ యూనియన్‌ నేతలు కె.పోశమ్మ, కె.ధనలక్ష్మి వెల్లడించారు. ఏ కారణంతోనైనా మరణించిన ఆశావర్కర్స్‌కు రూ.10లక్షలు ఇన్యూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌కు సంబంధించి రూ.60 వేలు ఇస్తామని కమిషనరు తెలిపారని, అందుకు తాము అంగీకరించలేదని, హర్యానాలో అమలువుతున్న విధంగా రూ.2 లక్షలు బెనిఫిట్స్‌ ఇవ్వాలని కోరినట్లు నేతలు తెలిపారు. ఆశా వర్కర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని తాము కోరినట్లు, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కమిషనరు తెలిపినట్లు యూనియన్‌ నేతలు పేర్కొన్నారు. కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లను ఆశా వర్కర్లుగా మార్చాలని కోరామని, ఈ సమస్యను ట్రైబల్‌ వెల్ఫేర్‌ డిపార్టుమెంట్‌ దృష్టికి తీసుకెళ్తామని అధికారులు హామీ ఇచ్చారని తెలిపారు. ఎఎన్‌ఎమ్‌, జిఎన్‌ఎమ్‌ ట్రైనింగ్‌ పొందిన ఆశ వర్కర్స్‌కు ఖాళీల భర్తీ సందర్భంగా ఆశా వర్కర్లకు వెయిటేజీ ఇవ్వాలని తాము కోరినప్పటికీ ప్రభుత్వం అంగీకరించలేదన్నారు. ఈనెల 26న చేపట్టనున్న ఐటిడిఎ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

➡️