వైసిపికి నెల్లూరు మేయర్‌ రాజీనామా

Jun 10,2024 23:08 #mayor, #Nellor, #resignation

ప్రజాశక్తి-నెల్లూరు సిటీ : వైసిపికి షాక్‌ తగిలింది. నెల్లూరు మేయర్‌ స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్‌ వైసిపికి రాజీనామా చేశారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వెంట నడుస్తామని ప్రకటించారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. వైసిపిని శ్రీధర్‌రెడ్డి వీడినప్పుడు తాము కూడా ఆయన వెంటే నడిచేందుకు మేయర్‌ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డామన్నారు. వైసిపి నేతలు తమను తిరిగి వైసిపిలోకి రావాలని తీవ్ర ఒత్తిడి చేశారనీ, పార్టీలోకి రాకపోతే మేయర్‌ పదవి నుండి తొలగిస్తామని బెదిరించారన్నారు. విధిలేని పరిస్థితుల్లో వైసిపిలోనే కొనసాగాల్సి వచ్చిందని తెలిపారు. శ్రీధర్‌రెడ్డిని ఎన్నోసార్లు అవమానించామని, వ్యక్తిగతంగా విమర్శించామని చెప్పారు. శ్రీధర్‌రెడ్డి తమను క్షమించి అక్కున చేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ బిక్ష పెట్టిన శ్రీధర్‌పై తమకు గౌరవం ఉందని, పొరపాటు జరిగి ఉంటే క్షమించాలని కోరారు.

➡️