- సాహితీ పురస్కార సభలో ప్రముఖ రచయిత్రి ఓల్గా
- కేశవరెడ్డి సాహితీ పురస్కారం-2024 అందజేత
ప్రజాశక్తి-గుంటూరు : సమాజంలో సాంకేతిక మార్పులు, సవాళ్లకు అనుగుణంగా కొత్త పద్ధతుల్లో సాహిత్య రచనకు సాహితీవేత్తలు, సంస్థలు కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రముఖ రచయిత్రి ఓల్గా అన్నారు. సాహిత్యాన్ని పాఠకులలోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. ప్రముఖ సాహితీవేత్త కొమ్మారెడ్డి కేశవరెడ్డి సాహితీ పురస్కార సభ శుక్రవారం గుంటూరులోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో జరిగింది. కేశవరెడ్డి సాహితీ పురస్కారం-2024ను రచయిత్రి ఓల్గాకు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, సాహితీవేత్త రావెల సాంబశివరావు తదితరులు అందజేశారు. ఈ సందర్భంగా ఓల్గా మాట్లాడుతూ.. ఫాసిస్టు ధోరణులు పెరుగుతున్న నేపథ్యంలో రచనా వ్యూహాలను మార్చుకొని, ప్రజల్లోకి ప్రత్యామ్నాయ సాహిత్యాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కొమ్మారెడ్డి వంటి గొప్ప సాహితీవేత్తల భావాల వారసత్వాన్ని కొనసాగించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ… ఉపాధ్యాయుడిగా, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడిగానే కాక సాహిత్య రంగంలో తనకంటూ కేశవరెడ్డి ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారని తెలిపారు. ముఖ్యంగా అనువాద సాహిత్యంలో గొప్పవారని కొనియాడారు. ఉపాధ్యాయులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు యు.రాజశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ డి.ఆంజనేయరెడ్డి, సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యాజీ, ప్రజాశక్తి బుక్ హౌస్ జనరల్ మేనేజర్ లక్ష్మయ్య, అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ, కేశవరెడ్డి కుటుంబ సభ్యులు శ్రీనివాసరెడ్డి, రాజీ తదితరులు పాల్గొన్నారు.