సెకీ ఒప్పందం ఉన్నా కొత్తగా సోలార్‌ ప్లాంట్లు

  • త్వరలో 3,750 మె.వాకు టెండర్లు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉచిత వ్యవసాయ విద్యుత్‌ కోసం గత ప్రభుత్వం సెకీ నుంచి అదానీ నుండి విద్యుత్‌ తీసుకునేందుకు ఒప్పందం చేసుకుంది. పాత ఒప్పందం ప్రకారం ఈ నెల రావాల్సిన ఈ విద్యుత్‌ వచ్చే ఏడాది నుంచి జనవరి నుంచి అందనుంది. ఆ ఒప్పందం అలా ఉండగానే ప్రస్తుత టిడిపి కూటమి ప్రభుత్వం మరో 3,750 మెగావాట్ల కు ప్రైవేట్‌ సోలార్‌ పెట్టుబడీదారుల నుంచి విద్యుత్‌ తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కేంద్రప్రభుత్వం పథకం పిఎం సూర్యఘర్‌ ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్‌ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకంలో భాగంగా అవసరమైన చోట్ల సోలార్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు.
దీనికి సంబంధించిన టెండర్లను అన్ని డిస్కంల తరపున ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటేడ్‌ (ఎపిసిపిడిసిఎల్‌) సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 3,750 మెగావాట్ల విద్యుత్‌కు టెండర్లు పిలవాలని విద్యుత్‌శాఖ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సుమారు 6,600 వ్యవసాయ ఫీడర్లు, 19లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. విద్యుత్‌శాఖ ప్రస్తుతం రూపొందిస్తున్న క్లీన్‌ ఎనర్జీ ముసాయిదాకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిన తరువాత ఈ దిశలో చర్యలు తీసుకోనున్నారు. ఈ ముసాయిదాలో సోలార్‌, విండ్‌ వంటి ప్రైవేటు ఉత్పత్తి సంస్థలకు ప్రోత్సాహకాలు, రాయితీలు, భూముల కేటాయింపు ఎలా చేయాలనే అంశాలను పొందుపరచనున్నారు.
సెకీ సంగతేంటి?
వ్యవసాయ విద్యుత్‌ కోసం సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సెకీ) నుంచి వచ్చే విద్యుత్‌ను ఏం చేయాలనేది ఇంకా తేలలేదు. గత వైసిపి ప్రభుత్వం సెకీ నుంచి 7వేల మెగావాట్ల విద్యుత్‌ను తీసుకొనేందుకు ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. అదానీ రెన్యుబల్‌ ఎనర్జీ నుంచి సెకీకి అందించే ఈ విద్యుత్‌ను రాష్ట్ర డిస్కంలకు అందించేలా త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. పాతికేళ్ల పాటు యూనిట్‌ రూ.2.49లకు ఈ విద్యుత్‌ అందించాలనేది ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం ఈ నెల నుంచి 3వేల మెగావాట్లు సరఫరా కావాల్సి ఉంది. 2025లో మరో 3వేల మెగావాట్లు, 2026లో మరో వెయ్యి మెగావాట్ల చొప్పున డిస్కంలకు అందాలి. అయితే రాజస్థాన్‌, గుజరాత్‌లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ గ్రిడ్‌కు అనుసంధానించే ప్రక్రియ పూర్తికాలేదు. దీంతో ఈ నెల రావాల్సిన విద్యుత్‌ను వచ్చే ఏడాది జనవరి నుంచి అందిస్తామని సెకీ డిస్కంలకు తెలిపింది. 3వేలకు బదులు వెయ్యి మెగావాట్లే అంది స్తామని చెప్పింది. 2026లో 3వేలు, 2027లో 3వేల మెగావాట్ల చొప్పున అందించనుంది.
అప్పుడు భారం…. ఇప్పుడు ఆమోదమా?
అదానీకి అనుకూలంగా ప్రజలపై భారాలు మోపే ఈ ఒప్పందాన్ని ప్రతిపక్షంలో ఉండగా టిడిపి తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడు మాత్రం అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది. సెకీ విద్యుత్‌పై అప్పటి పిఎసి చైర్మన్‌, ప్రస్తుత ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ హైకోర్టులో పిటిషన్‌ కూడా వేశారు. యూనిట్‌ విద్యుత్‌ ధర రూ.2ల లోపే లభిస్తున్న సమయంలో సెకీ నుంచి రూ.2.49లకు ఎందుకు కొనుగోలు చేశారని పిటిషన్‌లో పయ్యావుల ప్రశ్నించారు. ఇప్పుడు అదే సెకీ నుండి అదానీకి చెందిన విద్యుత్‌ను తీసుకునేందుకు టిడిపి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో ప్రజలపై భారాలు వేస్తారా అని విద్యుత్‌ రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

➡️