ఆర్థికశాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్‌రెడ్డి
అప్పులపైనా అబద్ధాలు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కూటమి నాయకులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు ఈ బడ్జెట్లో కేటాయింపులు లేవని రాష్ట్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి, వైసిపి నాయకులు బుగ్గన రాజేంధ్రనాథ్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకూ గత ప్రభుత్వం అప్పులు చేసిందని కూటమి నాయకులు చెప్పిందంతా అబద్ధమని బడ్జెట్ లెక్కల్లో తేలిపోయిందని అన్నారు. మొత్తం ప్రసంగంలో 25 సార్లు వైసిపి గురించి, 10 సార్లు విధ్వంసం గురించి ప్రాస్తవించారని తెలిపారు. బడ్జెట్లో సూపర్‌సిక్స్‌కు మొండిచేయి చూపించారని, ఏడాదిలోపే రూ.1.19 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. 63 పేరాల్లో ఒక్కచోట మాత్రమే సూపర్‌సిక్స్ అని ప్రస్తావించారని అన్నారు. అలాగే స్థూల ఉత్పత్తి అంచనాలపైనా తప్పుడు లెక్కలు చెప్పారని విమర్శించారు. 12.9 శాతం పెరుగుతుందని చెబుతున్నారని, అటువంటి లెక్కవేయాలంటే కనీసం మూడేళ్లు పడుతుందని అన్నారు. అలాగే 2024 మార్చి 31కి రూ.3.75 లక్షల కోట్ల అప్పు ఉందని, ప్రభుత్వ అప్పు రూ.4.38 కోట్లని తెలిపారు. లయబిలిటీస్‌లో రూ.80,194 కోట్లు, కార్పొరేషన్ అప్పులు రూ.2,48,677 కోట్లు, సివిల్ సప్లయి రూ.36 వేల కోట్లు, విద్యుత్ సంస్థలు రూ.34 వేల కోట్లు అన్నీ కలిపి రూ.9.74 లక్షల కోట్ల అప్పు ఉందని సిఎం తెలిపారని విరించారు. అయితే రూ.14 లక్షల కోట్లు అప్పులు చేశామని తమపై దుష్ప్రచారం చేశారని అన్నారు. వైసిపి హయాంలో రూ.3.33 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసినట్లు వివరించారు. కాగ్, ఎఐజి చెప్పిన లెక్కలనూ కూటమి నాయకులు తప్పుబడుతున్నారని అన్నారు. సంపద సృష్టించామని చెబుతున్నారని, వాస్తవంగా పదినెలల్లో మైనస్ 0.01 శాతం వృద్ధిలో ఉన్నారని అన్నారు. వైసిపికి చేతకాదు అని విమర్శ చేసిన చంద్రబాబునాయుడు అభివృద్ధిలో ఎందుకు వెనక్కుపోతున్నాడని ప్రశ్నించారు. కోవిడ్ సమయంలో రాష్ట్ర జిడిపిని లెక్కగట్టి దాన్నే పెద్దఎత్తున ప్రచారం చేశారని, ఇంతకంటే అన్యాయం మరొకటి ఉండదని విమర్శించారు. అలాగే సంక్షేమ పథకాల కేటాయింపుల్లోనూ కోతలు పెట్టారని పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ విషయంలోనూ అన్యాయంగా లెక్కలు చెప్పారని వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రూ.82,738 కోట్లు అప్పు చూపించి బడ్జెట్లో రూ.73,362 కోట్లు అని రాశారని తెలిపారు.
