విద్యుత్‌ వినియోగదారులపై రూ.8,114 కోట్ల ట్రూఅప్‌ చార్జీల భారం వద్దు 

ఇఆర్‌సికి సిపిఎం లేఖ

ప్రజాశక్తి-విజయవాడ : మూడు విద్యుత్‌ పంపిణీ సంస్థలు 2022-23 ఆర్ధిక సం॥లకు సంబంధించి 4 త్రైమాసికాల 8,114 కోట్ల రూపాయల ఎఫ్‌పిపిసిఎ (ఇంధన సర్దుబాటు చార్జీలు) ప్రతిపాదనలను అనేక నెలల క్రితమే విద్యుత్‌ నియంత్రణ మండలికి పంపినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల ముందు వీటిపై ప్రజాభిప్రాయం తీసుకోకుండా జాప్యం చేయడం సరికాదని పేర్కొంటూ సిపిఐ(యం) ఆంధ్రప్రదేశ్‌ కమిటీ విద్యుత్‌ నియంత్రణ మండలికి (ఇఆర్‌సి)కి నేడు లేఖ వ్రాసింది.  ఈ లేఖలో…
వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన మండలి ట్రూఅప్‌ చార్జీలపై నిర్ణయం తీసుకోకుండా ఇప్పటివరకు కాలయాపన చేయడం సమంజసం కాదు. నిబంధనలకు విరుద్ధంగా హిందూజా సంస్ధకు (హెచ్‌ఎన్‌పిసిఎల్‌) రూ.1,234.68 కోట్లు విద్యుత్‌ సంస్థలు చెల్లించడం అక్రమం. ఈ భారాన్ని కూడా ట్రూఅప్‌ ప్రతిపాదనలలో కలపడం శోచనీయం. ఈ అక్రమ చెల్లింపుపై మండలి ముందు సిపిఎం గతంలో పలుసార్లు లేవనెత్తిన్పటికీ, దీనిపై చర్చించడానికి మండలి నిరాకరించి, నేడు ట్రూఅప్‌ ప్రతిపాదనలో ప్రజల కళ్ళుగప్పే రీతిలో పొందుపర్చడం ఆక్షేపణీయం.
పంపిణీ సంస్థలు ట్రూఅప్‌ ప్రతిపాదనలపై సమాచారం ఇచ్చిన తర్వాత 8 నెలల పాటు మండలి స్పందించకుండా కాలయాపన చేయడం గర్హనీయం. తీవ్ర జాప్యం అనంతరం 30.09.2024న 4 త్రైమాసికాల ప్రతిపాదనలపై నోటిఫికేషన్‌ విడుదల చేసి 12 పిటిషన్లపై ఒకేసారి హడావుడిగా విచారణ చేపట్టడం తగదు. 14 రోజుల్లో (ఈనెల 14వ తేదీ నాటికి) అభ్యంతరాలు తెలపాలని, 3 రోజుల అనంతరం (ఈనెల 18న) బహిరంగ విచారణ చేస్తామని మండలి ప్రకటించడం అభ్యంతరకరం. అభ్యంతరాలు తెలిపిన అనంతరం పంపిణీ సంస్థలు సమాధానాలు, వివరణలు 3 రోజుల్లో పంపటం, వాటిని అధ్యయనం చేసి అభ్యంతరాలు తెలిపిన సంస్థలు, పార్టీలు, వ్యక్తులు విచారణలో తమ అభిప్రాయాలు తెలపడం సంక్లిష్టమైన ప్రక్రియ.
ఈ నెలాఖరు నాటికి మండలి ఛైర్మన్‌, టెక్నికల్‌ సభ్యుడు పదవీకాలం పూర్తవుతున్న సమయంలో హడావుడిగా ఇటువంటి విచారణ చేపట్టడం హేతుబద్ధం కాదు. నియంత్రణ మండలి నిబంధనల స్ఫూర్తికి భిన్నంగా, ఏకపక్షంగా రూ.8,114 కోట్లు ట్రూఅప్‌ భారాలపై విచారణ ప్రక్రియ సాగించడం, దానిని మొక్కుబడి తంతుగా మార్చడం తగదు. ఈప్రతిపాదనలపై సిపిఐ(యం) పేర్కొన్న అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకొని బహిరంగ విచారణ ప్రక్రియలో తగు మార్పులు చేయాలి. తగు సమయం ఇవ్వాలి. నిబంధనలు పాటించాలి. తగు సమయం ఇవ్వని ఎడల ట్రూఅప్‌ ప్రతిపాదనలపై సిపిఐ(యం) అభ్యంతరాలను, అభిప్రాయాలను మరో లేఖలో వివరంగా తెలియజేస్తామని పేర్కొంది.

➡️