విద్యుత్తు కొనుగోళ్లలో అవినీతి లేదు : వైసిపి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ హయాంలో జరిగిన సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లో అవినీతి చోటు చేసుకోలేదని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి అన్నారు. టిడిపి డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా బురద జల్లే యత్నం చేస్తోందని చెప్పారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాటాడారు. రాయలసీమ ఫ్లైయాష్‌ను సొమ్ము చేసుకునేందుకు కడప, అనంతపురానికి చెందిన కూటమి ఎమ్మెల్యేలు ఘర్షణ పడుతున్నారని, ఈ అంశం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే టిడిపి తప్పడు ఆరోపణలు చేస్తోందన్నారు. టిడిపి నేత ఆనం వెంకట రమణారెడ్డి వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా ఖండించారు. మాజీ సిఎస్‌ అజెరు కల్లాం, మాజీ ముఖ్యమంత్రి జగన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల వ్యక్తిత్త్వాన్ని హననం చేసేలా ఆనం మాట్లాడారని తప్పుబట్టారు. నిజానికి గత టిడిపి ప్రభుత్వ హయాంలో యూనిట్‌ రూ.4.99 నుంచి 5.99 వరకూ కొనుగొలు చేసేలా 36 ఒప్పందాలు చేసుకున్నట్లు చెప్పారు. దీని వల్ల ప్రజలపై రూ.1.13 కోట్ల భారం పడిందన్నారు. జగన్‌ హయాంలో యూనిట్‌ రూ.2.49లకే కొనుగోలు చేశారని, దీని వల్ల ఏటా రూ.3,700 కోట్లు ఆదా అవుతుందని చెప్పారు. అదానీ సంస్థతో ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని, కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతోనే ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.

➡️