- రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద వైసిపి నిరసనలు
- నిరుద్యోగ భృతి, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్
ప్రజాశక్తి – యంత్రాంగం : విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు రూ. మూడు వేలు భృతి ఇవ్వాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, కొత్త మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ఉపసంహరించుకుని, పేదలకు వైద్య విద్యను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు, విద్యార్థులు, వైసిపి శ్రేణులు ఆందోళనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి చేపట్టిన ‘యువత పోరు’లో భాగంగా కలెక్టరేట్ల వద్ద బుధవారం నిరసనలు తెలిపారు. పలు జిల్లాల్లో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్లకు, ఆయా అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
విజయవాడ కోర్టు సెంటర్‌లోని సివిఆర్ స్కూల్ నుంచి మ్యూజియం రోడ్డు గుండా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు వారిని అడుగడుగునా అడ్డుకున్నారు. మ్యూజియం రోడ్డులో నాలుగు చోట్ల బారీకేడ్లను ఏర్పాటు చేశారు. వైసిపి శ్రేణులు కలెక్టరేట్‌కు వెళ్లకుండా అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల నిర్బంధాలను దాటుకుని వైసిపి నాయకులు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అయితే కలెక్టరేట్ గేట్లను పోలీసులు మూసివేయడంతో పోలీసులకు వైసిపి నాయకులకు వాగ్వాదం జరిగింది. అనంతరం డిఆర్‌ఒకు వినతిపత్రం అందజేశారు. మచిలీపట్నంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తదితరులు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఆధ్వర్యంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాకినాడకు చేరుకున్నారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఒకానొక దశలో పోలీసులకు, వైసిపి నాయకులు వాగ్వాదం చోటు చేసుకుంది. కాకినాడ మాజీ ఎంపి వంగా గీత, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మాజీ మంత్రులు తోట నరసింహం, ముద్రగడ పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు నేటికి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. ఏలూరులో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం అందించారు.
విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పాల్గొన్నారు. అనకాపల్లి కలెక్టరేట్ వద్ద తలపెట్టిన కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ… మోసపూరిత హామీలతో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో చాలా మంది విద్యార్థులు చదువులు మానుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. నిరుద్యోగ భృతి ఒట్టి హామీగానే మిగిలిపోయిందని విమర్శించారు. అల్లూరి జిల్లా పాడేరులో అంబేద్కర్ సెంటర్ నుంచి ఐటిడిఎ కార్యాలయం మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. శ్రీకాకుళంలోని జ్యోతిరావు ఫూలే పార్కు నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ..విద్యా వసతి దీవెన బకాయిలు చెల్లించలేని దౌర్భగ్య స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని, మెగా డిఎస్‌సి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన తొలి సంతకానికి నేటికి అతీగతి లేకుండా పోయిందని విమర్శించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. అబద్ధపు హామీలతో అధకారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ హామీలు అమలు చేయలేక చేతులెత్తేసిందన్నారు.
విజయనగరం కంటోన్మెంట్ పార్కు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. పార్వతీపురంలో ఆర్‌టిసి కాంప్లెక్సు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. మాజీ ఎంపి బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు శంబంగి చిన అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, బడుకొండ అప్పలనాయుడు పాల్గొన్నారు. పార్వతీపురంలో మాజీ మంత్రి రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి ప్రసంగించారు. విద్యార్థులకు రూ.4,600 కోట్లు బకాయిలు ఉండగా బడ్జెట్‌లో రూ.2,000 కోట్లు కేటాయించారని, నిరుద్యోగ భృతికి అసలు బడ్జెట్‌లో నిధులే కేటాయించలేదన్నారు. అనంతపురంలో జడ్‌పి కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు కలెక్టర్ వద్ద చేపట్టిన ఆందోళననుద్దేశించి మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. టిడిపి కూటమి ప్రభత్వుం అధికారంలోకి తొమ్మిదినెలలు గడిచినా యువతకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు.