రెసిడెన్షియల్‌ తరగతులొద్దు

Nov 28,2024 23:51 #classes, #No residential, #utf
  • శ్రీనివాసరావు మృతిపై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విజయనగరం జిల్లాలో లీడర్‌షిప్‌ శిక్షణలో ఉపాధ్యాయుడు ఎస్‌ శ్రీనివాసరావు మృతిపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రెసిడెన్షియల్‌ శిక్షణా తరగతులు నిర్వహించొద్దన్నా నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాయి. రెసిడెన్షియల్‌ శిక్షణ తరగతులను రద్దు చేయాలని యుటిఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. సాల్ట్‌ కార్యక్రమంలో భాగంగా శిక్షణ పేరుతో ఉపాధ్యాయులపై ఒత్తిడి తీసుకురావడం సరికాదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయులందరికీ అందుబాటులో మండల లేదా డివిజన్‌ కేంద్రాల్లో శిక్షణా తరగతులు నిర్వహించాలని, లేదంటే శిక్షణా తరగతులనే రద్దు చేయాలని ఎపిటిఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు, ఎస్‌ చిరంజీవి డిమాండ్‌ చేశారు. సాల్ట్‌ పథకం కింద నిర్వహిస్తున్న రెసిడెన్షియల్‌ శిక్షణల్లో ఉపాధ్యాయులు మానసికంగా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని డెమొక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె నరహరి, ఎన్‌వి రమణ తెలిపారు. విద్యాశాఖ మంత్రి, అధికారులు తక్షణమే స్పందించి తరగతులను రద్దు చేయాలని ఎపి ప్రైమరీ టీచర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎజిఎస్‌ గణపతిరావు, కె ప్రకాష్‌రావు డిమాండ్‌ చేశారు. తరగతులను రద్దు చేయాలని షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి సుధాకర్‌, కె కుమార్‌, ఎస్‌టిఎఫ్‌ అధ్యక్షులు ఎస్‌ రామాంజనేయులు, ఫూలే టీచర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అన్నం శ్రీనివాసులు, వాసిలి సురేష్‌, ఎపిటిఎఫ్‌ అమరావతి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సివి ప్రసాద్‌, రాధాకృష్ణ వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్‌ చేశారు.

➡️