- అదానీతో ఒప్పందాలు రద్దు చేయాలి
- సిపిఎం రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్ ట్రూఅప్, సర్దుబాటు చార్జీలను రద్దు చేయాలని రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన సెకి ఒప్పందం వల్ల ప్రజలపై లక్షల కోట్ల భారం పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఒప్పందంపై టిడిపి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. సెకి ఒప్పందంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, లేదంటే ఈ అవినీతిలో టిడిపి కూటమికి కూడా భాగం ఉందని భావించాల్సి ఉంటుందని చెప్పారు. ‘ట్రూఅప్, సర్దుబాటు చార్జీలు, అదానితో విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు బిగించొద్దని, అదానీపై విచారణ జరిపి శిక్షించాలని’ సిపిఎం విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ పార్టీ రాష్ట్రకమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రజాశక్తి ప్రచురించిన ‘అవినీతి కిలాడీలు- రక్షణలో పాలకులు’ అనే ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలో మోదాని పాలన నడుస్తోందని, వీరిద్దరికి మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్ జత కలిశారని విమర్శించారు. ముగ్గురు కలిసి లక్షల కోట్ల భారాన్ని రాష్ట్రంపై రుద్దారని చెప్పారు. అదాని కోసం సెకిని మోడీ దళారీగా మార్చారని విమర్శించారు. అదాని విషయంలో జగన్‌తో సైతం రాజీపడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధపడ్డారని తెలిపారు. సెకి ఒప్పందంపై అధ్యయనం చేస్తున్నామని కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. వ్యవసాయ పంపుసెట్లకు పెట్టిన స్మార్ట్‌మీటర్లను పగలకొట్టాలని ప్రతిపక్షంలో పిలుపునిచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటిని సమర్ధిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మీటర్లను టిడిపి కూడా కొనసాగిస్తే అదాని, షిర్డిసాయి నుంచి లంచాలు తీసుకుందని భావించాల్సి ఉంటుందన్నారు. సెప్టెంబర్ నాటికి 3వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేస్తామని సెకి ఒప్పందంలో ఉందని, ఇప్పటికీ ఒక్క యూనిట్ కూడా అందలేదన్నారు. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు అదానిపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. అదాని రూ.2వేల కోట్ల లంచం ఇచ్చి 25 ఏళ్ల పాటు రాష్ట్రప్రజలపై లక్షల కోట్ల భారం మోపారని విమర్శించారు. ఇప్పటికే రూ.16వేల కోట్ల భారాన్ని కేవలం రెండు నెలల్లోనే మోపి, పదేళ్లల్లో లక్షకోట్లు వసూలు చేసుకునే సామర్ధ్యం ఉందని నిరూపించారని చెప్పారు. దీనిని ఇలానే సహించాలా? ప్రతిఘటించాలా? అనేది ప్రజలు నిర్ణయం తీసుకోవాలని అన్నారు. తొందరపాటు నిర్ణయాలతో టిడిపి కూటమి ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతుందన్నారు. దీనిని ఇలానే ప్రదర్శిస్తే అతి తొందరగానే టిడిపి కూటమి అభాసు పాలవుంతున్నారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ రూ.9,412 భారం మోపడానికి ఎపిఇఆర్‌సికి అంత తొందర ఏమిటని ప్రశ్నించారు. ఇంత తక్కువ కాలంలో రూ.16వేల కోట్ల భారం మోపడం ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలేదన్నారు. జనవరి నుంచి యూనిట్‌కు రూ.2.19లు అదనంగా ప్రజలపై పడనుందని చెప్పారు. ఈ భారాలను తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు. రాబోయే రోజుల్లో మరింత పెద్దఎత్తున పోరాటానికి సిద్ధపడాలని తెలిపారు. జగన్-అదాని భేటీ రహస్య ఒప్పందం వివరాలను బయట పెట్టాలని తాము కూడా డిమాండ్ చేశామని తెలిపారు. సెకి ఒప్పందంపై గతంలో తమతో పాటు ఆర్ధిక శాఖమంత్రి పయ్యావుల కేశవ్ కోర్టులో పిటిషన్ వేశారని తెలిపారు. ఈ ఒప్పందంపై సిఎం చంద్రబాబుకు పరిశీలన చేయాల్సిన అవసరం లేదని పయ్యావుల కేశవ్ వద్ద సమాచారం మొత్తం ఉందన్నారు. అదానికి భయపడి చర్యలు తీసుకునే దైర్యం లేక చంద్రబాబు వివరాలు కావాలని కాలయాపన చేస్తున్నారని తెలిపారు. తనపై ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానంటున్న జగన్ దమ్ముంటే తమపై వేయాలని సవాల్ విసిరారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు, వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పవర్ వల్ల తాను అధికారం కోల్పోయినట్లు ఇటీవల చంద్రబాబు మాట్లాడారని అన్నారు. ఆ అనుభవాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఐదు నెలల్లోనే రూ.16వేల కోట్ల భారం మోపారని తెలిపారు. అదాని, కేంద్రంలో ఉన్న బిజెపి, వైసిపి, టిడిపి ప్రభుత్వ విధానాల వల్ల అదనపు భారం ప్రజలపై పడనుందన్నారు. త్వరలో ప్రజల ఇళ్లలోకి అదాని మీటర్లు, కరెంట్ వస్తుందని, కార్పొరేట్లకు వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే వీటిని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఎంసిపిఐ(యు) నాయకులు సలీం మాట్లాడుతూ నరేంద్రమోడీ అడుగుజాడల్లో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో భారాల ప్రభుత్వంగా మారిందన్నారు. సిపిఎం విజయవాడ పశ్చిమ నగర కార్యదర్శి కృష్ణ వందన సమర్పణ చేసిన ఈ కార్యక్రమంలో రైతు సంఘం సీనియర్ నాయకులు వై కేశవరావు, కౌలు రైతు సంఘం నాయకులు ఎం హరిబాబు, విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదిక నాయకులు ఎంవి ఆంజనేయులు బెఫి రాష్ట్ర నాయకులు అజయకుమార్, బిఎస్‌ఎన్‌ఎల్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు బోస్, తదితరులు పాల్గొని ప్రసంగించారు. ప్రజాశక్తి సిజిఎం వై అచ్యుతరావు, డివైఎఫ్‌ఐ కార్యదర్శి జి రామన్న, ఎఐవైఎఫ్ నాయకులు లెనిన్, ఆవాజ్ రాష్ట్ర కార్యదిర్శ చిష్టీ తదితరులు పాల్గొన్నారు.