ఉగ్రవాదంపై ఐక్యపోరు

సర్వ మత ప్రతినిధుల సమావేశంలో గవర్నర్‌
కాల్పుల విరమణ శుభపరిణామం : చంద్రబాబునాయుడు
 మానవత్వానికే తొలి ప్రాధాన్యత : పవన్‌కల్యాణ్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ప్రపంచానికి ముప్పుగా మారిన ఉగ్రవాదంపై కుల, మతాలకు అతీతంగా ఐక్య పోరు చేయాలని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పిలుపునిచ్చారు. అన్ని మతాలకు చెందిన ప్రతినిధులతో రాజ్‌భవన్‌లో శనివారం సాయంత్రం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ ఏప్రిల్‌ 22న పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన దాడి, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలను వివరించారు. సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతున్న సైనికులకు అండగా ఉండాలని అన్నారు. ప్రపంచాన్ని ఉగ్రవాదం పీడిస్తోందని, అందరూ కలిసి దీనిని అడ్డుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో మత విద్వేషాలకు తావు లేదని అన్నారు. అన్ని మతాలకు చెందినవారు ధృడమైన ఐక్యతతో ఉన్నారని చెప్పారు. ఉగ్రవాదం ఎక్కడున్నా దేశంలో తీవ్ర అనిశ్చిత పరిస్థితికి దారితీస్తుందని తెలిపారు. సరిహద్దుల్లో జరుగుతున్న పోరాటంలో రాష్ట్రానికి చెందిన జవాను మురళీనాయక్‌ మరణించారని చెబుతూ ఆయనకు నివాళులర్పించారు. పాకిస్తాన్‌ నుండి వచ్చిన విరమణ ప్రతిపాదనను ఒప్పుకోవడం చూస్తే మన దేశానికి యుద్దం చేయాలన్న ఆలోచన ఎప్పుడూ లేదన్న విషయం అర్ధమవుతోందని చెప్పారు. కాల్పుల విరమణ శుభపరిణామమని ఆయన చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ భారతదేశం సహనానికి మారుపేరని తెలిపారు. ఎన్ని, మతాలు కులాలు ఉన్నా మొదటి ప్రాధాన్యత మానవత్వానికే అని అన్నారు. దేశాన్ని విడగొట్టడానికి అనేక రకాల శక్తులు ప్రయత్నిస్తుంటా యని, వాటిని ఐక్యంగా ఎదుర్కొంటామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ మాట్లాడుతూ దేశ రక్షణకు అవసరమైన విధంగా కేంద్రానికి సంపూర్ణ సహకారం ఇస్తామన్నారు. డిజిపి హరీష్‌కుమార్‌ గుప్తా మాట్లాడుతూ రాష్ట్రంలో తీసుకుంటున్న రక్షణ చర్యలను వివరించారు. తొలుత వేర్వేరు, మతాలు, సంస్థలకు చెందిన ప్రతినిధులు మాట్లాడుతూ ఉగ్రవాదంపై పోరులో ఏకతాటిపై ఉంటామని తెలిపారు. ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి అనిత కూడా పాల్గొన్నారు.

➡️