ఉక్కు ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడం దుర్మార్గం

Nov 26,2024 23:16 #Dharna, #Employees, #visaka steel plant
  • ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : ఉక్కు ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం యాజమాన్యం నిర్లక్ష్యానికి నిదర్శనమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి 1384వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్‌ ఎల్‌ఎంఎం, డబ్ల్యుఆర్‌ఎం 1, 2, ఎంఎంఎస్‌ఎం, ఎస్‌టిఎం విభాగాల కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఉక్కు కర్మాగారం ప్రగతికి కృషి చేస్తున్న కార్మికవర్గానికి రెండు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం దుర్మార్గమన్నారు. ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని తెలిపారు. ఏడు నెలలుగా రెండు వాయిదాల పద్ధతిన జీతాలు చెల్లిస్తున్న ఉక్కు యాజమాన్యం రెండు నెలలుగా పూర్తిగా జీతాలే చెల్లించకపోవడం దారుణమన్నారు. ప్లాంట్‌ యాజమాన్యం మొండి వైఖరి పట్ల కార్మికులు అసహనంతో ఉన్నారని తెలిపారు. తక్షణమే సమస్యను పరిష్కరించకుంటే కార్మికుల ఆగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు. దీక్షల్లో నాయకులు ఎ.మసేన్‌రావు, డి.దేముడు, జి.ఆనంద్‌, ఎంకెవి.రాజేశ్వరరావు, సన్నిబాబు, పి.సీతారామరాజు, రాంబాబు, బాషా, కార్మిక సంఘాల నాయకులు విల్లా రామ్మోహన్‌ కుమార్‌, ఎం.మహాలక్ష్మి నాయుడు, దాసరి సురేష్‌ బాబు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు

➡️