బోధినేతర పనులను ఎత్తివేయాలి

May 21,2024 17:02 #Kurnool, #utf leaders, #Visit
  •  ఒకే సిలబస్‌ విధానం అమలు చేయాలి
  •  యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్‌ ఎస్‌ ప్రసాద్‌

ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్‌ : రాబోయే విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులకు కేవలం విద్యార్థులకు బోధనకు సమయం ఉండేలా చూడాలని యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బోధ నేతర పనులను పూర్తిగా ఎత్తివేయాలని పేర్కొన్నారు. మంగళవారం కర్నూలులోయుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్‌ ఎస్‌ ప్రసాద్‌ పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సహాధ్యక్షుడు కే సురేష్‌ కుమార్‌, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రవికుమార్‌ నవీన్‌ పాటి జిల్లా సహాధ్యక్షుడు హేమంత్‌ కుమార్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రానున్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఒకే సిలబస్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఒకటి నుండి అయిదు తరగతులకు సంబంధించిన ప్రాథమిక పాఠశాలలను ఒకే చోట పెట్టాలన్నారు. జీవో నెంబర్‌ 117 ను కూడా వెంటనే రద్దు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 23 వేల ఉపాధ్యాయ టీచర్‌ పోస్టులు అన్నిటిని భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. 1998 2008 డీఎస్సీ ద్వారా నియమితులైనటువంటి ఎంటిఎస్‌ ఉపాధ్యాయులకు వెంటనే రెగ్యులర్‌ చేయాలన్నారు. ట్రైబల్‌ వెల్ఫేర్‌ స్కూల్లలో పనిచేస్తున్న సిఆర్‌టిలను కూడా రెగ్యులర్‌ చేయాలన్నారు. రాష్ట్రంలో నూతన విద్యా విధానాన్ని అమలు చేయకుండా ప్రస్తుతం ఉన్నటువంటి విద్యావిధానాన్ని మరింత బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలన్నిటిని పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

➡️