కార్యకర్తలను కలవకపోవడమే కొంపముంచింది- వైసిపిలో అంతర్మథనం

Jun 11,2024 23:33 #insider, #YCP

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :అధికారంలో ఉన్న ఐదేళ్లలో కిందిస్థాయి నాయకలను, కార్యకర్తలను నేరుగా కలకవపోవడమే కొంపముంచిందని వైసిపి అధినాయకత్వం అభిప్రాయపడిందని తెలిసింది. ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం జిల్లాల వారీగా, ముఖ్య నాయకులతోనూ చర్చల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను కూడా సిఎం వద్దకు వెళ్లకుండా కోటరీలోని కొందరు అడ్డుకున్నారనే అభిప్రాయాన్ని కొద్దిరోజులుగా జరుగుతున్న సమావేశాల్లో ఎక్కువమంది నాయకులు వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనికి కొందరు సలహాదారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు కొంత వాగ్వాదం కూడా జరిగినట్టు చెబుతున్నారు. గతంలో కొందరు ప్రజా ప్రతినిధులను ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెడితే, అందరు తన వద్దకు నేరుగా వస్తే మీరుండేది దేనికని, మీ ప్రాధాన్యత ఏమిటని జగన్‌ ప్రశ్నించారని, ‘మీరే చూసుకోండి’ అని అన్నారని ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఒక సలహాదారు అన్నట్లు సమాచారం. దీనికితోడు గ్రామ పంచాయతీల్లో నిధులు తీసేసుకోవడం వల్ల సర్పంచులందరూ పార్టీలకు అతీతంగా ఏకమయ్యారని, అది కూడా నష్టం కలిగించిందనే అభిప్రాయానికి ఈ సమీక్షల్లో వచ్చారు. కిందిస్థాయి నాయకత్వాన్ని పట్టించుకోకపోవడంతో వారు కూడా ఎన్నికల్లో సహకరించలేదని నిర్థారణకు వచ్చారు. మరోవైపు మీడియాను చులకనగా చూడటం వల్ల ప్రజలు కూడా కొంత ఆందోళనకు గురయ్యారని నలుగురు మాజీ మంత్రులు అన్నట్లు తెలిసింది. పదే పదే మీడియాను టార్గెట్‌ చేయడం, అదే సమయంలో ఎక్కువగా పోలీసు వేధింపులు పెరగడం వల్ల సామాన్యులు భయపడ్డారని ఇది తీవ్రంగా నష్టం కలిగించిందన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది.

➡️